హైదరాబాద్ మెట్రో రెండో దశ ముందుకు కదలడం లేదు. గ్రేటర్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. దీంతో దీనికి కారణం మీరంటే మీరు అని నిందించుకునే రాజకీయాలను బీజేపీ, కాంగ్రెస్ ప్రారంభించాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మెట్రో రెండో దశకు కేంద్రం అనుమతులు ఇస్తోంది. కానీ హైదరాబాద్ విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదు. దీన్ని రేవంత్ రెడ్డి హైలెట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం చేసిన తల తిక్క పని వల్లనే సాధ్యం కావడం లేదని .. కేంద్రం రెడీగా ఉందని కిషన్ రెడ్డి సందేశం పంపాలనుకుంటున్నారు. కానీ రేవంత్ ఊరుకోరుగా.. ఆయన రాజకీయం ఆయన చేస్తున్నారు.
లేఖల యుద్ధం
జనవరి 15న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి .. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రెండోదశకు కేంద్రం రెడీగా ఉందని.. కమిటీ వేసిందని అందులో రాష్ట్ర ప్రభుత్వం తరపు నియమించాల్సిన ఇద్దరు అధికారుల పేర్లను పంపలేదని, అందుకే ప్రాజెక్టు నిలిచిపోయిందని ఆరోపించారు. అదే సమయంలో ఎల అండ్ టీతో ఒప్పందాన్ని పూర్తి చేయాలన్నారు. అది పూర్తయిన తర్వాతనే తదుపరి చర్యలు తీసకుుంటామన్నారు. దీనికి కౌంటర్ ఇస్తూ జనవరి 18న సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అధికారుల పేర్లను తాము డిసెంబర్లోనే పంపించామని, ప్రస్తుతం ఫైల్ కేంద్రం వద్దే ఉందని ఆయన స్పష్టం చేశారు. జనవరి 17న కేంద్రం అడిగిన అదనపు వివరణలను కూడా పంపినట్లు రేవంత్ రెడ్డి సమాధాన లేఖ రాశారు.
ఆగిపోయిన నెపం ఒకరిపై ఒకరు తోసేసుకోవడానికే !
రెండో దశ విస్తరణ ప్రారంభం కాకుండానే ఆగిపోవడానికి కారణం మీరంటే మీరని నిందించడానికే ఇవన్నీ. గత ఏడాది అక్టోబర్లో ఎల్ అండ్ టీ నుంచి మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. అది పూర్తి చేయాలంటే ప్రభుత్వం చాలా నిధులను కేటాయించాల్సి ఉంది. ఆ వెసులుబాటు లేదు. రెండో దశ కోసం ఓ కమిటీని కేంద్రం నియమించింది. ఇది సంయుక్త కమిటీ సంయుక్త కమిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 12నే ఇద్దరు అధికారుల పేర్లను ప్రతిపాదించింది. అయితే, డిసెంబర్ 29న కేంద్రం పంపిన కొర్రీలతో అసలు సమస్య మొదలైంది. అంతర్గత కమిటీ వివరాలపై కేంద్రం మరిన్ని వివరణలు కోరింది. ఈ ప్రక్రియ వల్ల మెట్రో రెండో దశ ఆమోదం ఇంకా లభించలేదు.
ఎన్నికల కోసం నిందలేసుకునేందుకే !
ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే స్థాయికి చేరింది. రాష్ట్రం పంపిన పేర్లలో స్పష్టత లేదని కేంద్రం వాదిస్తుంటే, కావాలనే జాప్యం చేస్తున్నారని రాష్ట్రం ఆరోపిస్తోంది. ఈ రాజకీయ , పరిపాలనాపరమైన చిక్కుల వల్ల మెట్రో రెండో దశ విస్తరణ పనులు పట్టాలెక్కడంలో మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. లక్షలాది మంది నగర వాసులకు రవాణా సౌకర్యం కల్పించే ఈ మెగా ప్రాజెక్టు, కేవలం ప్రొసీజరల్ కారణాలతో నిలిచిపోయింది. తప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే.. రెండు వర్గాలు చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్క వారి మీద తోసేయడానికి రాజకీయాలు ప్రారంభించాయి. కానీ అసలు మెట్రో రెండోదశను పట్టాలెక్కించడంపై అంత దృష్టి పెట్టడం లేదు.


