ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ పూర్తిగా మారిపోయింది. లావాదేవీలు పెరిగాయి. ఆదాయంలో ఈ అంశం స్పష్టంగా కనిపిస్తోంది. మూడు నెలల కాలంలో ఆస్తుల లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 39 శాతం పెరిగింది. ఐదు సంతవ్సరాల స్తబ్ధత తర్వాత .. మళ్లీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచడానికి.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
అమరావతి పనులు ఊపందుకుంటున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఆకర్షిస్తున్నారు. విశాఖకు ఐటీ రంగం పెద్ద ఎత్తున తరలి వస్తోంది. ఉత్తరాంధ్రలో లావాదేవీలు పెరుగుతున్నాయి. రాయలసీమలో తయారీ రంగం ఊపందుకుంటోంది. ఉపాధి అవకాశాలు పెరగడంతో సహజంగానే రియల్ ఎస్టేట్ కు డిమాండ్ పెరుగుతుంది.
గతంలో వివిధ అవసరాల కోసం ఆస్తులను అమ్మాలనుకున్నవారు సరైన రేటు రాక ఆగిపోయారు. ఇప్పుడు ఆశించినంత ధరలు వస్తూండటంతో.. ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నారు. కొనుగోలుదారులూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ మరింత పెరగనుంది. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా .. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.