భారతదేశాన్ని అంతర్జాతీయ కృత్రిమ మేధ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్అనేక చారిత్రాత్మక విజయాలను నమోదు చేసింది. కానీ అసలు లక్ష్యాల కంటే రాజకీయ వివాదాలే పతాక శీర్షికల్లో నిలిచాయి. ప్రభుత్వ యంత్రాంగం ఈ సదస్సును ఒక రాజకీయ ప్రచార వేదికగా మార్చుకుంది. దానికి పోటీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేదికలోకి దూసుకు వచ్చి అర్థనగ్న ప్రదర్శనలు చేశారు. ఇక గల్గోటియాస్ వంటి విద్యాసంస్థల తీరుతో మరింత పరువు పోయింది. కొన్ని మీడియా చానళ్లు క్షేత్రస్థాయిలోని మౌలిక వసతుల లోపాలపైనే దృష్టి సారించి అసలు విజయాలను పట్టించుకోలేదు.
ఏఐ దిగ్గజాలను ఆకర్షించిన ఇండియా సమ్మిట్
ఈ రాజకీయ గందరగోళానికి అతీతంగా భారత్ ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమైంది. గూగుల్ అధినేత సుందర్ పిచాయ్ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి , విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న అత్యాధునిక AI హబ్, రాబోయే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలవనున్నాయి. 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరైన ఈ వేదికపై, 80కి పైగా దేశాలు భారత్ ప్రతిపాదించిన AI డిక్లరేషన్‌పై సంతకాలు చేయడం దేశ దౌత్య విజయానికి నిదర్శనం. అలాగే, వ్యూహాత్మక సాంకేతిక కూటమి అయిన ప్యాక్స్ సిలికా లో భారత్ అధికారికంగా చేరడం ద్వారా ప్రపంచ టెక్ పరిపాలనలో కీలక భాగస్వామిగా అవతరించింది.
భారత స్టార్టప్‌ల అద్భుత విజయాలు
సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేసే క్రమంలో భారత్ ఆవిష్కరించిన మానవ్ విజన్ ప్రపంచ దేశాల ప్రశంసలు పొందింది. నైతికత, జవాబుదారీతనం , సార్వత్రిక అందుబాటు వంటి సూత్రాలతో కూడిన ఈ విధానం, AI అభివృద్ధిలో మానవీయ కోణాన్ని చాటిచెప్పింది. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం తీసుకువచ్చిన బోధ్ ప్లాట్‌ఫారమ్, రోగుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా వైద్య పరిశోధనలు నిర్వహించేలా రూపొందించబడింది. సదస్సులో భాగంగా మూగ, బధిరుల కోసం ప్రదర్శించిన రియల్-టైమ్ AI సైన్ లాంగ్వేజ్ అనువాదం సమ్మిళిత వృద్ధికి సాంకేతికత ఎలా తోడ్పడుతుందో నిరూపించింది. సదస్సులో ప్రదర్శించిన 300కు పైగా డీప్-టెక్ ఆవిష్కరణలు భారత స్టార్టప్ రంగం పరిణతిని చాటిచెప్పాయి.
స్టార్టప్ క్రియేటర్లకు కావాల్సింది ప్రచారం… !
కేవలం ప్రయోగాత్మక దశలో ఉన్న నమూనాలకే పరిమితం కాకుండా, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న సాంకేతికతను భారత యువత ప్రపంచం ముందు ఉంచింది. వాటికి కావాల్సిన ప్రచారం మాత్రం ఈ వేదికగా లభించలేదు. రాజకీయ విమర్శలు , మీడియా సృష్టించిన చిన్నపాటి అవాంతరాలను పక్కన పెడితే, ఈ సదస్సు ద్వారా భారత్ గ్లోబల్ AI మ్యాప్‌లో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది. వివాదాల కంటే దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగిన ఈ సదస్సు ఫలితాలు భవిష్యత్తులో భారత డిజిటల్ ముఖచిత్రాన్ని మార్చనున్నాయి.
