దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసీపీ అధినేత జగన్ అల్టిమేటం జారీ చేశారు. దంపతులిద్దరూ ఒకే పార్టీలో ఉండాలని.. ఆ అల్టిమేటం సారాంశం. ఇప్పటికే దగ్గుబాటికి వైసీపీలో ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. పర్చూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత రావి రామనాథం బాబును వైసీపీలో చేర్చుకున్నారు. నియోజకవర్గానికి సంబంధించి ఆయన మాటలకే ప్రాధాన్యం ఇవ్వాలని… అధికారులకు, పార్టీ నేతలకు కూడా.. సందేశం వెళ్లింది. మాట మాత్రంగా కూడా చెప్పకుండా రావి రామనాథం బాబును పార్టీలో చేర్చుకోవడం.. తనకు ప్రాధాన్యంత తగ్గించడంతో… దగ్గుబాటికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. జగన్ ను కలిసేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేదు. చివరికి ఆయన వద్దకు జగన్ దూతల్ని పంపారు.
జగన్ తరపున మాట్లాడిన వారు పురంధేశ్వరి వైసీపీలో వస్తారా..? మీరు బీజేపీలోకి వెళ్తారా..? అనేదానిపై క్లారిటీ అడిగినట్లుగా తెలుస్తోంది. ఇద్దరూ చెరో పార్టీలో ఉండటం వల్ల.. సమస్యలు వస్తున్నాయని… పురందేశ్వరి వైసీపీలోకి వస్తే.. ప్రాధాన్యం ఇస్తామని … లేకపోతే… పార్టీకి అవసరం లేదన్నట్లుగా.. సమాచారం పంపారు. ఇదే విషయాన్ని ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించారు. నిజానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరాలనుకోలేదు. ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్ ను పార్టీలో చేర్చారు. కానీ ఆయనకు అమెరికా పౌరసత్వం ఉంది. నామినేషన్ల సమయానికి ఆ పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేసుకోలేకపోయారు. ఫలితంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావే పోటీ చేయాల్సి వచ్చింది. కానీ పరాజయం పాలయ్యారు.
ఇన్నాళ్లూ లేనిది ఒక్కసారిగా వైసీపీ హైకమాండ్ నుంచి.. పురంధేశ్వర వైసీపీలోకి రావాలని… లేకపోతే.. పార్టీకి అవసరం లేదన్నట్లుగా సమాచారం రావడం.. దగ్గుబాటి వర్గీయులకు ఓ రకంగా షాక్కు గురి చేసేదే. ఎందుకంటే.. ఎన్నికల సమయంలో… పురందేశ్వరి బీజేపీలోనే ఉన్నారు. ఆ పార్టీ తరపున విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో.. వైసీపీ అగ్రనాయకత్వం ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. హఠాత్తుగా.. ఇప్పుడు… పురందేశ్వరి బీజేపీలో ఉండటం.. ఇష్టం లేదన్నట్లుగా సమాచారం పంపడం.. దగ్గుబాటికి విస్మయానికి గురి చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పురందేశ్వరి బీజేపీని వీడే అవకాశమే లేదు. జగన్ పార్టీలో ఆమె ఇమిడే పరిస్థితి కూడా లేదు. అంతిమంగా దగ్గుబాటి ఫ్యామిలీని దూరం పెట్టడానికే జగన్ .. ఈ స్కెచ్ వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.