ప్రపంచంలో ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నా ఒక్కోసారి అభాసుపాలు అవుతుంటారు, కానీ ప్లాన్ చేసుకుని మరీ నవ్వుల పాలు అవ్వడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరు. పాపం, ఆయన దురదృష్టం ఏమిటంటే ఆయన లీడర్ గా ఎదిగిన కాలం సోషల్ మీడియా కాలం కావడం. ఆయన నాలుగు గంటల పాటు పెట్టిన సుదీర్ఘ ప్రెస్ మీట్ చూస్తుంటే, మీమర్లకు రాబోయే నాలుగు నెలల వరకు సరిపడా కంటెంట్ ను జగన్ భాషలో చెప్పాలంటే గంపగుత్తగా పంపిణీ చేసినట్లు కనిపిస్తోంది.
క్రికెట్ అంటే టీవీలో చూసేదే కదా!
స్టేడియంకు వెళ్లి లైవ్ మ్యాచ్ చూడటం అనేది ఒక ఎమోషన్ అని కోట్లాది మంది భావిస్తుంటే, జగన్ రెడ్డి గారు మాత్రం ఒక విప్లవాత్మకమైన సలహా ఇచ్చారు. స్టేడియంకు వెళ్లి చూడటం ఎందుకు, టీవీలో చూడొచ్చు కదా అంటూ ఆయన వెలిబుచ్చిన మేధోమథనం వింటే సామాన్యులకు మతిపోవాల్సిందే. బహుశా ఆయన ఒక పాయింట్ మర్చిపోయారు.. స్టేడియంలో కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు పెడతారు, అక్కడికి వెళ్లి కూడా టీవీలో చూసే బదులు ఇంట్లో కూర్చుని చూడమని ఆయన చెప్పడం వెనుక ఉన్న అపారమైన తెలివి స్టేడియంకు వెళ్లే వాళ్లకు లేదని ఆయన ఫిక్స్ అయిపోయినట్టున్నారు.
కాలజ్ఞానాన్ని మించిన మ్యాచ్ జ్ఞానం!
ఇక కామెడీ పీక్స్‌కి వెళ్ళింది ఎక్కడంటే.. అక్టోబర్ 15న జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను ఆయన అక్టోబర్ 18న చూశారట! చరిత్రలో వెనక్కి వెళ్లి మ్యాచ్ చూసే వింత టెక్నాలజీ ఏమైనా పులివెందులలో కనిపెట్టారో లేక జగన్ గారి డైరీలో క్యాలెండర్ మూడు రోజులు వెనుక ఉందో కానీ, ఆయన చెప్పిన లైవ్ సోది వింటే సామాన్య భక్తులకు లడ్డూ కల్తీ కంటే ఈ లాజిక్ కల్తీనే ఎక్కువ షాక్ ఇస్తోంది. ఐదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి తేదీలు, సందర్భాల మీద ఉన్న పట్టు చూసి నెటిజన్లు దండం పెడుతున్నారు.
గంపగుత్తా.. తెలుగు తిప్పలు !
తనకు తెలుగు వీక్ అని చెప్పుకుంటూనే, జగన్ వాడిన కొన్ని పదాలు వింటే అవి అచ్చ తెలుగు బూతులుగా వినిపించి అందరినీ ఆశ్చర్యపరిచాయి. రాసిచ్చిన స్క్రిప్టును చదివే క్రమంలో గంపగుత్తగా అనే పదాన్ని పలకలేక ఆయన పడ్డ తిప్పలు, ఆ క్రమంలో దొర్లిన మాటలు పచ్చి బూతుల్లా ధ్వనించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. స్క్రిప్ట్ రాసేవారు కాస్త జగన్ గారి తెలుగు పాండిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాల్సింది, లేకపోతే ఇలాగే అర్థం మారి అనర్థం జరుగుతూ ఉంటుంది.
ఒకవైపు పచ్చి అబద్ధాలను పదే పదే నిజాలని నమ్మించే ప్రయత్నం, మరోవైపు ప్రాథమిక విషయ పరిజ్ఞానం కూడా లేని తీరు.. ఇవన్నీ చూస్తుంటే ఈ వ్యక్తేనా ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది అని సామాన్యుడికి సందేహం రాక మానదు. ఇలాంటి నేత మాటలను నమ్మి ఇంకా ఆయన వెనుక నడిచే వారు, ఓట్లు వేసే వారి ఓపికకు నిజంగా జోహార్లు చెప్పాల్సిందే. రాజకీయంగా విశ్లేషించడానికి ఇక్కడ ఏమీ లేదు, కానీ వినోదం పరంగా చూస్తే మాత్రం జగన్ రెడ్డి అన్ స్టాపబుల్!
