వైఎస్సార్సీపీ అధినే వైయస్ జగన్ ఈ వాదం పెళ్లి ప్రోగ్రాములు మాత్రమే పెట్టుకున్నారు. కల్తీ పాల మరణాలు, బాణసంచా పేలుడు వంటి ఘటనలు జరిగినా పరామర్శలకు వెళ్లాలని ఆయన అనుకోలేదు. మొదట్లో ఆయన సోమవారం పరామర్శకు వెళ్తారని వైసీపీ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. అయితే సోమవారం ఆయనఅసలు తాడేపల్లికే రాలేదు. మంగళవారం వచ్చారు. వచ్చిన వెంటనే భట్టి విక్రమార్క కలిసి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. పిలిచేందుకు బెంగళూరు వస్తానని ఆయన అడిగినా… తాను తాడేపల్లికి వచ్చిన తర్వాత రావాలని సమాచారం ఇవ్వడంతో.. పిలుపుల కోసం ఆయన మరోసారి తాడేపల్లి రావాల్సి వచ్చింది.
బుధవారం బాధితుల్ని పరామర్శించే ప్రోగ్రాం పెట్టుకోలేదు. పార్టీ నేతల పెళ్లిళ్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అరకులో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరు అవుతారు. తర్వాత విశాఖ చేరుకుని రాణాప్రతాప్ నగర్లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళతారు. ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. ఈ రెండు చోట్ల ఎప్పట్లాగే జన సమీకరణకు ముందుగానే ప్లాన్ చేశారు.
సాధారణంగా దుర్ఘటనలు జరిగినప్పుడు జగన్ రెడ్డి అసలు వదిలి పెట్టరు. విజయోత్సవాల తరహాలో ఊరేగింపులు చేసుకుంటూ వెళ్లి బాధితుల్ని పరామర్శిస్తారు. అయితే ఆయన పరామర్శలన్నీ పార్టీ నేతలకే పరిమితమవుతున్నాయి. సాధారణ ప్రజల్ని ఆయన పరామర్శించడం లేదు. అలా పరామర్శకు వెళ్తే ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుందన్న కారణంతో పాటు..తనను ఓడించారన్న కోపంతో కూడా ఆయన ప్రజల పరామర్శకు పోవడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. విమర్శలు వస్తున్నాయని అనుకుంటే.. బాధితుల వద్దకు వెళ్లేందుకు కార్యక్రమం ఖరారు చేసుకునే అవకాశం ఉంది.
