అసెంబ్లీకి వెళ్లేందుకు భయపడుతున్న జగన్ రెడ్డి అసెంబ్లీని కించ పరిచారు. బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చారని అడ్డగోలుగా మాట్లాడారు.స్పీకర్ నుంచి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్య నర్సీపట్నం వెళ్లినప్పుడూ స్పీకర్ పై తప్పుడు ఆరోపణలు చేశారు. ఆయన ఇలా మాట్లాడటం అసెంబ్లీని కించ పర్చడమేనని కూటమి నేతలు వరుసగా తెరపైకి వచ్చి విమర్శలు చేస్తున్నారు. జగన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండానే కించ పరిచారు.. ఇప్పుడు ఆయనకు సంబంధం లేకుండా అసెంబ్లి జరుగుతున్నా.. అదే పని చేశారు. ఇదంతా కూటమి నేతలు ఎందుకు చెప్పుకుంటున్నారు?. ఆయనపై చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా? తీసుకుంటామని బెదిరిస్తున్నారా?
కరణం బలరాంపై చర్యలు తీసుకున్నది గుర్తుంటుందా?
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కరణం బలరాం.. అసెంబ్లీకి సంబంధం లేని కార్యక్రమంలో ఎక్కడో బయట.. స్పీకర్ గా ఉన్న సురేశ్ రెడ్డిపై విమర్శలు చేశారు. కరణం బలరాంపై అప్పటికే పగ పెంచుకున్న వైఎస్ అండ్ కో.. ఆయనను ఎలాగైనా శిక్షించాలనుకున్నారు. ఆయన అసెంబ్లీకి వచ్చి దూకుడుగా మాట్లాడటం ఇష్టం లేక ..ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడానికి దాన్ని కారణం చేసుకున్నారు. బయట అసెంబ్లీని కించపరిచారని.. చర్యలు తీసేసుకున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి అంత కంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు.
స్పీకర్ తో పాటు అసెంబ్లీని కించ పరుస్తున్న జగన్
స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై జగన్ అసభ్యంగా మాట్లాడుతున్నారు. అదే సమయంలో బాలకృష్ణ గురించి అనుచితంగా మాట్లాడారు. బాలకృష్ణ తాగి వచ్చారన్నదానికి ఆయన దగ్గర ఉన్న ఆధారాలేమిటో బయట పెట్టాల్సింది. అసెంబ్లీ గౌరవాన్ని తగ్గించడానికే జగన్ రెడ్డి కుట్రపూరితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ రెడ్డిపై చర్యలు తీసుకోవడానికి కూటమికి ధైర్యం ఉండదు. పెద్దగా అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రావడం లేదు. అసెంబ్లీకి రాని ఆయన .. రాళ్లేస్తున్నారు.
చర్యలు తీసుకునే ధైర్యం ఉందా ?
జగన్ పై చర్యలు తీసుకోవాలంటే సస్పెన్షన్ ఒక్కటే మార్గం కాదు.. అనర్హతా వేటు కూడా వేయవచ్చు. మరో ఇరవై రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఆయన అరవై రోజుల కోటా పూర్తవుతుంది. అప్పుడు అనర్హతా వేటువేయవచ్చనని డిప్యూటీ స్పీకర్ చెబుతున్నారు. అప్పుడైనా ఆ నిర్ణయం తీసుకుంటారో లేదో చెప్పడం కష్టం కానీ.. ఏ చర్యలు తీసుకోకుండా ఇలా.. జగన్ కించపరిచాడని.. అవమానించాడని మాట్లాడుతూ పోతే ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. ప్రజలు కూడా అలవాటుపడిపోతారు.
