Jatadhara Movie Review
తెలుగు360 రేటింగ్:0.5/5
‘కృష్ణ గారి అల్లుడు, మహేష్ గారి బావ అనే ట్యాగ్ సినిమా ఆఫీసుల్లో కప్పు కాఫీ ఇవ్వగలిగింది కానీ అంతకుమించి నేను ఏ అడ్వాంటేజ్ తీసుకోలేదు’ అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు సుధీర్ బాబు. నిజమే.. తనకున్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కి పెద్ద కాంబినేషన్లు, ప్రొడక్షన్స్ తో సినిమాలు చేయొచ్చు. కానీ తనకంటూ ఒక సొంత మార్క్ క్రియేట్ చేసుకోవాలని ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలే చేస్తున్నాడు సుధీర్. ప్రతి సినిమాకి కష్టపడుతున్నాడు. కానీ ఆశించిన విజయం మాత్రం అందడం లేదు. గత కొన్నాళ్లుగా అయితే అన్ని పరాజయాలే. ఇప్పుడు హిందీ ప్రొడక్షన్ హౌస్ జీ స్టూడియోస్ తో కలిసి ‘జటాధర’ సినిమా చేశాడు. ఇప్పటివరకు తను చేసిన 20 సినిమాల్లో ఇదే బెస్ట్ స్క్రిప్ట్ అని ఆయన చెప్పడం సినిమాపై ఎంతో కొంత ఆసక్తిని పెంచింది. మరి నిజంగా సుధీర్ బాబు చెప్పినట్టు అంత గొప్ప కథ జటాధరలో ఏముంది ? ఈ సినిమా సుధీర్ బాబు కోరుకునే విజయాన్ని ఇచ్చిందా?
పూర్వకాలంలో ధనరాసులని భూమిలో పాతి వాటికి బంధనాలతో కాపలా పెట్టేవారు. అలా రుద్రారం గ్రామంలో ఓ ఇంట్లో లంకె బిందెలకు కాపాలాగా వుంటుంది ధన పిశాచి (సోనాక్షి సిన్హా). అయితే బంధనానికి విఘాతం కలిగి ధనపిశాచి రక్తాన్ని మరుగుతుంది. ఆ భయంతో రుద్రారం గ్రామం ఖాళీ అవుతుంది. కట్ చేస్తే..శివ(సుధీర్‌బాబు) ఓ ఘోస్ట్ హంటర్. సైంటిఫిక్‌గా దెయ్యాలు లేవని నిరూపించడం అతడి లక్ష్యం. ఓ బాబును తన తల్లి చంపుతున్నట్లు ఓ పీడకల శివని తరుచూ వేధిస్తుంటుంది. ఈ పీడకలకి, ధనపిశాచికి, శివకి వున్న సంబంధం ఎమిటనేది మిగతా కథ?
కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఆశ్చర్యంతో మాట పడిపోతుంది. ఇంకొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అసలు ఈ సినిమాని ఎందుకు తీసారనే షాక్ తో మాటలు రాని పరిస్థితి ఏర్పడుతుంది. జటాధర.. ఈ రెండో కోవకు చెందిన సినిమా. ‘లంకె బిందెలకు ఓ పిశాచి కాపలాగా ఉంటుంది’ ఈ ఐడియా చాలు అదిరిపోతుందనే అతి విశ్వాసంతో సెట్స్ మీదకి వెళ్ళిపోయిన సినిమా ఇది. హారర్, సూపర్ నేచురల్, డివైన్.. ఇలా ఇప్పుడు ట్రెండ్ లో వున్న అన్ని ఎలిమెంట్స్ కలిపేసి చివరికి శివ దర్శనం చేస్తే జనం సినిమాని చుసేస్తారనే అత్యాశతో చేసిన ప్రయత్నమిది.
కథ, కథనాలు గురించి చెప్పడానికి మీ వుండదు. ఒక ధన పిశాచి, ఒంటినిండా బంగారం వేసుకొని వెర్రినవ్వులు నవ్వుతూ వుంటుంది. దెయ్యాలు లేవని నమ్మించే ఘోస్ట్ హంటర్ చీకట్లో పాడుబడ్డ బంగ్లాల్లో తిరుగుతుంటాడు. బోనస్ గా అతడికో కల వస్తుంటుంది. ఆ కల గురించి తెలుసుకోవడమే ఇంటర్వెల్. ఆ తర్వాత ఒక భూత పూజ, పిమ్మట శివలింగాల ప్రతిష్ట.. క్లైమాక్స్. ఏంటి ఈ రెండు సీన్లతోనే సెకండ్ హాఫ్ అయిపోతుందా? అని సందేహం వస్తే మాత్రం మీ తప్పుకాదు. ఆ సన్నివేశాలు అటువంటివి.
భూత పూజ ఎట్లా జరపబడును అనే ప్రశ్నకు వందమార్కుల వ్యాసం రాసినట్లు వుంటుంది వ్యవహారం. అంత పీడ అనుభవించాక ఇంకా దాన్ని మాటల్లో చెప్పి హింసించడం అనవసరం. ముందు కోడిని బలిస్తారు. తర్వాత మేక, తర్వాత దున్నపోతు.. ఈ మూడు ఐటమ్స్ మూడు నిముషాలు అనుకుంటే పొరపాటే. రెండు ఎపిసోడ్ల సీరియల్ కి సరిపడే నిడివి. ఆ అంతు చూస్తున్న ప్రేక్షకుడి హాహాకారాలు.. ఆర్తనాదాలకు అంతులేదు.
ఇక క్లైమాక్స్ శివలింగాల ప్రతిష్ట. నిజానికి డివైన్ ఎలిమెంట్ ఈ రోజుల్లో సక్సెస్ ఫుల్ సూత్రం. కానీ జటాధరలో ఆ ఫార్ములా ని వాడుకున్న విధానం చూస్తే జాలిపుడుతుంది. అనంత పద్మనాభ స్వామి, నాగబంధనం, అరుణాచలం, అష్ట లింగ ప్రతిష్ట, శివతాండవం..ఇలా ఏవేవో చూపిస్తుంటారు. కానీ అందులో ఒక్క ఎలిమెంట్ కూడా హత్తుకునేలా వుండదు.
ఘోస్ట్ హంటర్ గా సుధీర్ బాబు పాత్ర చాలా రెగ్యులర్. తను కొత్తగా పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ లేని కథ ఇది. చివర్లో శివతాండవం చేస్తాడు. కానీ అప్పటికే ప్రేక్షకుడిలో నిరాశ ఆవహించి వుంటుంది. వంటినిండా నగలు వేసుకొని పిశాచిలా అరిచే పాత్రలో సోనాక్షి కనిపించింది. డైలాగ్ గొడవ లేదని ఒప్పేసుకుని వుంటుంది. సుధీర్ బాబు లవర్ గా ఓ అమ్మాయి కనిపించింది. ఆమెది ఆర్కియాలజి డిపార్ట్మెంట్. కానీ భూతవైద్యురాలిగా అనిపించే అవకాశం వుంది. శుభలేఖ సుధాకర్ ఇచ్చే ఎలివేషన్స్, డైలాగ్ డిక్షన్ చిరాకు తెప్పిస్తాయి. అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల, ఝాన్సీ పేరుకి వున్నారంతే.
‘కార్పోరేట్ కల్చర్ లో సినిమాకి లాభాలు కంటే నష్టాలు ఎక్కువ. వాళ్ళు ఒక బడ్జెట్ అన్నాక ఇంక దానికే ఫిక్స్ అయిపోతారు. సీన్ ఇంకా బెటర్ తీసే అవకాశం వున్నా ఒక్క రూపాయికి కూడా ఇవ్వరు.’ ఈ సినిమా ప్రమోషన్స్ లో సుధీర్ బాబు చెప్పిన మాటది. ఈ సినిమా చూశాక ఆ వెలితి కనిపించింది. జి స్టూడియోస్ సినిమా మేకింగ్ చాలా నాసిరకంగా వుంది. ఎఐ గ్రాఫిక్స్ సిల్లీగా వున్నాయి, ఆర్ట్ వర్క్ బొమ్మలాటలా వుంది. విజువల్స్ లో డెప్త్ లేదు. కెమరావర్క్, మ్యూజిక్ గురించి మాట్లడుకోవడం అనవసరం. ఈ సినిమా దర్శకులు వెంకట్, అభిషేక్. ఇద్దరూ కొత్తే, వాళ్ళ అనుభరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.
‘పోరాడాలి, గెలిచే దాక పోరాడాలి’ ఈ సినిమాలో సుధీర్ బాబు చెప్పిన డైలాగ్ ఇది. ఈ సినిమాని మర్చిపోయి.. సుధీర్ బాబు హిట్టు కొట్టేవరకూ పోరాడాలి. తప్పుదు.
తెలుగు360 రేటింగ్: 0.5/5