తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత జెట్టి కుసుమ కుమార్. ఆయన కాంగ్రెస్ లో ఆ పొజిషన్ లోకి ఎలా వెళ్లారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఎప్పుడూయాక్టివ్ రాజకీయాలు చేసినట్లుగా కనిపించరు. ఆయన ఇప్పుడు తమిళనాడులోనూ హడావుడి చేస్తున్నారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పేరుతో కులంఘం పెట్టి గతంలో హైదరాబాద్లో సభ నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో నిర్వహిస్తున్నారు.
తమిళనాడులో 60 లక్షల మంది వరకూ కమ్మ ఓటర్లు
తమిళనాడులో సహజంగానే కుల రాజకీయాలు ఉంటాయి. తమిళనాడు అంతటా దాదాపు 40 నుండి 60 లక్షల మంది వరకు కమ్మ సామాజికవర్గంవారు ఉన్నట్లు అంచనా. వీరు ప్రధానంగా చెన్నై, తిరువళ్లూరు , కోయంబత్తూరు, ఈరోడ్ , మధురై, విరుదునగర్, రాజపాళయం వంటి ప్రాంతాల్లో ఉన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో ఈ వర్గం అత్యంత శక్తివంతమైనది కావడంతో, వీరి ఓటు బ్యాంకు ఏ పార్టీ గెలుపునైనా ప్రభావితం చేయగలదని భావిస్తారు. అందుకే ఆ వర్గం హైలెట్ అవుతోంది.
ద్రావిడ పార్టీల ఓటు బ్యాంక్
తమిళనాడులోని కమ్మవారిని కమ్మవార్ నాయుడు లేదా నాయక్కర్ అని పిలుస్తారు. సహజంగా ద్రావిడ పార్టీలైన DMK లేదా AIADMK వైపు మొగ్గు చూపుతుంటారు. గతంలో విజయ్ కాంత్ DMDK వంటి నేతలకు ఈ వర్గం అండగా నిలిచింది. ఈ సారి కూడా డీఎంకే కూటమికి అండగా ఉండేలా చూడాలన్న ఉద్దేశంతో జెట్టి కుసుమకుమార్ రాజకీయాలు చేస్తున్నారు. చెన్నై, మధురై, కోయంబత్తూరు వంటి నగరాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ .. ఇప్పుడు భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు.
బలప్రదర్శన చేసి ఎక్కువ సీట్లు పొందే ప్లాన్ లో కాంగ్రెస్
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ DMK కూటమిలో భాగంగా ఉంది. ఈ వర్గాన్ని సంఘటితం చేయడం ద్వారా సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ బేరసారాల శక్తిని పెంచుకోవడమే కాకుండా, తెలుగు ఓటర్ల మద్దతుతో పార్టీకి బలమైన పునాది వేయాలని ఆయన వ్యూహం. కేవలం ఓటర్లుగానే కాకుండా, రాజకీయ నాయకులుగా ఎదగాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. కానీ ఇది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చెప్పడం కష్టం.


