హీరోయిన్ల మధ్య పోటీ ఉంటుంది. కానీ అది కనిపించదు. వృత్తిలో ఉండే పోటీ అన్ని చోట్లా ఉంటుంది.కానీ ఇప్పుడు తమన్నా, పూజా హెగ్డే మధ్య ఇప్పుడు ఓ భిన్నమైన.. వారికి సంబంధం లేని పోటీ , వివాదం నడుస్తోంది. అది కూడా కర్ణాటకలో . ప్రభుత్వ యాజమాన్యంలో ఉండే మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటి తమన్నా భాటియాను ఎంపిక చేశారు. సోప్ ను రీబ్రాండింగ్ చేస్తూ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కన్నడ హీరోయిన్లు చాలా మంది ఉంటే.. తమన్నాను ఎందుకు ఎంపిక చేశారని ఇప్పుడు కన్నడ పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.
బ్రాండ్ కర్ణాటక మైసూర్ శాండల్ సోప్
దశాబ్దాల చరిత్ర కలిగిన కర్ణాటక వారసత్వ చిహ్నం మైసూర్ శాండల్ సోప్ చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక బ్రాండ్‌ను సరికొత్తగా మార్కెట్లోకి తెచ్చే క్రమంలో కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ నటి తమన్నా భాటియాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అయితే, కర్ణాటకకు చెందిన నటీమణులను కాదని, ఇతర రాష్ట్రాలకు చెందిన నటిని ఎంచుకోవడంపై కన్నడ సంఘాలు ,ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
మైసూర్ శాండల్ సోప్ కేవలం ఒక ఉత్పత్తి మాత్రమే కాదని, అది కన్నడిగుల ఆత్మగౌరవమని వారంటున్నారు.
కన్నడ హీరోయిన్లు బ్రాండింగ్‌కు పనికి రారా?
కర్ణాటకలో పుట్టి పెరిగిన పూజా హెగ్డే, రష్మిక మందన్న, రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి వంటి అద్భుతమైన నటీమణులు ఉండగా, ఉత్తరాదికి చెందిన తమన్నాను ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ఈ ఉద్యమకారులు వేస్తున్న ప్రశ్న. బీజేపీ నేతలు సైతం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. స్థానిక తారలను విస్మరించడం కాంగ్రెస్ ప్రభుత్వ కన్నడ వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని అంటున్నారు.
మార్కెట్ ను ఉత్తరాదికి విస్తరించడానికే తమన్నా ఎంపిక
ఈ వివాదాన్ని కర్ణాటక ప్రభుత్వం తేలికగా తీుకుంది. ఈ నిర్ణయం పూర్తిగా వ్యాపార కోణంలో తీసుకున్నదే తప్ప, భావోద్వేగాలతో సంబంధం లేదని అంటున్నారు. మైసూర్ శాండల్ సోప్ అమ్మకాలలో కేవలం 12 నుంచి 18 శాతం మాత్రమే కర్ణాటకలో జరుగుతున్నాయి. మిగిలిన 80 శాతానికి పైగా మార్కెట్ రాష్ట్రం వెలుపల ఉంది. 2030 నాటికి రూ. 5,000 కోట్ల టర్నోవర్ సాధించడమే మా లక్ష్యం. అందుకే పాన్-ఇండియా గుర్తింపు ఉన్న తమన్నాను ఎంపిక చేశాం అని చెబుతున్నారు.
తమన్నాతో రెండేళ్ల కాలానికి రూ. 6.2 కోట్ల ఒప్పందాన్ని మైసూర్ శాండల్ కుదుర్చుకుంది. ఫిబ్రవరి 10 నుంచి ఆమె అధికారికంగా ప్రచారకర్తగా తన పనులను ప్రారంభించారు.
