హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ కు చెందిన బస్సుకు నిప్పు అంటుకుని అందులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనం అయ్యారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. కర్నూలు జిల్లా ఉలిందకొండ వద్ద బస్సును ఓ బైక్ ఢీకొట్టి.. బస్సు కిందకు వెళ్లిపోయింది. అక్కడ డీజిల్ ట్యాంకర్‌కు తగలడంతో మంటలు వచ్చినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. తప్పించుకోలేకపోయారు.
బస్సులో నలభై మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లుగా అంచనా. పదిహేను మంది వరకూ గాయపడ్డారు. అతి తక్కువ మంది మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంఘటనాస్థలానికి వెళ్లి సహాయకార్యక్రమాలను అందించాలని కలెక్టర్ ను ఆదేశించింది. మృతి చెందిన వారిలో అత్యధిక మంది హైదరాబాద్ కు చెందిన వారుగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
2013లో కూడా ఇలాంటి ప్రమాదమే షాద్ నగర్ సమీపంలో జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం గ్రామం వద్ద బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో మల్టీ-అక్సిల్ సెమీ-స్లీపర్ బస్సు కల్వర్ట్ లో ఢీకొని మంటల్లో చిక్కుకుంది. బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ అయి, ప్రయాణికులు బయటపడలేకపోయారు. 45 మందిలో 19 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దీపావళి సమయంలో హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నవారు. ఇప్పుడు దీపావళి ముగించుకుని వెళ్తున్న వారికి ఈ ప్రమాదం జరిగింది.
