కల్వకుంట్ల కవిత ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ. ఆమె రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. అయితే రాజీనామా ఆమోదం, శాసనమండలిలో ఆమెచేసిన భావోద్వేగ ప్రసంగంతో పాటు ఆమె రాజకీయవ్యూహాలు చూస్తే కాంగ్రెస్ సహకారంతోనే సాగుతున్నట్లుగా ఎవరికైనా అనిపిస్తుంది. కవిత రాజకీయం వెనుక కాంగ్రెస్ ఉందని బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు. బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ వాదనకే ఎక్కువ చేకూరుస్తోంది.
మండలిలో భావోద్వేగ ప్రకటనకు పూర్తి సహకారం ఇచ్చిన మండలి చైర్మన్
మండలిలో కవిత ప్రసంగం వ్యూహాత్మకంగా సాగింది. ఆమె తన చివరి ప్రసంగానికి సహకరించారు మండలి చైర్మన్. గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున చైర్మన్ అయినప్పటికీ ఆ పార్టీకి దూరంగా..కాంగ్రెస్ తో దగ్గరగాఉంటున్నారు. కవిత కు సహకరించాలని ఆయన నిర్ణయించుకున్నారు. కవిత మండలిలో తన వీడ్కోలు ప్రసంగంలో ప్రజా సమస్యల కంటే బీఆర్ఎస్ పార్టీని నిందించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె ప్రసంగంలో ఎక్కడా కేసీఆర్ పట్ల గతంలో ఉన్నంత విధేయత కనిపించలేదు. అదే సమయంలో ఆమె ప్రభుత్వ పనితీరుపై మెతక వైఖరి అవలంబించడం.. రాజకీయ అవగాహన ఉందనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
రాజీనామా ఆమోదంలో టైమింగ్ వెనుక మర్మం
సెప్టెంబర్లో ఇచ్చిన రాజీనామాను జనవరి వరకు పెండింగ్లో ఉంచి, సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న సమయంలో ఆమోదించడం వెనుక కాంగ్రెస్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. పాత స్థానిక ప్రతినిధులు, ఉన్నప్పుడు ఉపఎన్నిక రాకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడింది. దీనికి కవిత కూడా సహకరించడం, ఎక్కడా జాప్యంపై నిరసన తెలపకపోవడం చూస్తుంటే.. భవిష్యత్తులో ఆమె కాంగ్రెస్తో కలిసి నడిచే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ను ఇబ్బంది పెట్టకుండా ఆమె వ్యవహరిస్తున్న తీరు బీఆర్ఎస్ శ్రేణుల్లోనే విస్మయానికి గురిచేస్తోంది.
భవిష్యత్తు కార్యాచరణ.. కాంగ్రెస్ సహకారంతోనే రాజకీయాలు ?
బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే కవిత వైఖరిని తప్పుబడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆమె రాజకీయంగా పని చేస్తున్నారని రాజకీయ మనుగడ కోసమే ఆమె ఈ దారి ఎంచుకున్నారని గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం వంటి కేసుల వల్ల కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్ అండ అవసరమని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీనే ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సొంత పార్టీ పెట్టి..కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారా..లేకపోతే బీఆర్ఎస్ను ఓడిండానికి ఓ అస్త్రంగా ఉపయోగపడతారా అన్నది చర్చనీయాంశంగా మారుతోంది.


