పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం, డీపీఆర్ వెనక్కి, 40 టీఎంసీల లేఖ.. ఇలా చాలా అంశాలను కేసీఆర్ రాజకీయ అంశాలుగా మార్చారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీపై వేసిన రాళ్లే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాటిని ఎదుర్కోవడానికి రెడీ అయింది. ఆయనకు కౌంటర్ గా పెట్టిన ప్రెస్మీట్లు, చిట్చాట్లు అన్నీ రాజకీయం. కానీ అసెంబ్లీలో చర్చించి.. అసలు తప్పెవరిదో తేల్చడం మాత్రం..ప్రజలతో ముడిపడిన రాజకీయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే అంశంపై సవాల్ చేశారు. జనవరి రెండో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు. కేసీఆర్ వచ్చి చెప్పుకోవాల్సింది చెప్పుకోవచ్చని సవాల్ చేశారు. కేసీఆర్ వచ్చినా రాకపోయినా రేవంత్ తన గేమ్ ఆడతారు. బీఆర్ఎస్ నేతలు బయట ఎన్ని కబుర్లు చెప్పినా అవి వ్యాలిడ్ అయ్యే అవకాశాలు ఉండవు.
చిచ్చు రాజేసింది కేసీఆరే !
నీళ్లను నిప్పులుగా మార్చి రాజకీయంగా పండగ చేసుకుందామని కేసీఆర్ రెండేళ్ల తర్వాత తన పాత ఆయుధంతో బరిలోకి వచ్చారు. ఆయన ఇప్పుడు దాన్ని పట్టుకుని నిలబడి కొట్లాడాల్సిందే. ఎందుకంటే ఆయన చిచ్చు పెట్టేశారు. ఇప్పుడు దానికి ఎవరు కారణం.. ఎవరి వల్ల నష్టం.. ఎవరు నిర్లక్ష్యం చేశారు అన్నది రెండు పార్టీలు తేల్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే కేసీఆర్, రేవంతే తేల్చుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ తాను చెప్పాలనుకున్నది మైక్ ముందు మాత్రమే చెబుతాను.. అసెంబ్లీకి మాత్రం రాను అంటే ప్రజలు కూడా వ్యతిరేకంగా స్పందిస్తారు. ఎందుకంటే ఈ అంశంపై ఆరోపణలు చేసింది కేసీఆర్. వాటిని అసెంబ్లీలో ప్రజల ముందు పెట్టాల్సింది కూడా ఆయనే. నిజమని నిరూపించాల్సింది కూడా ఆయనే.
అసెంబ్లీకి రాకపోతే రేవంత్ కు అడ్వాంటేజ్ !
కేసీఆర్ అసెంబ్లీకి హాజరుపై స్పష్టత లేదు. ప్రెస్‌మీట్ తర్వాత ఓ జర్నలిస్టు అసెంబ్లీకి వెళ్తారా అని అడిగితే.. ధ్యాంక్యూ అని చెప్పి వెళ్లిపోయారు. నిజంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎదుర్కొంటా.. తోలు వలుస్తా అని ఆయన చెప్పినట్లయితే ఓ రేంజ్ పోరాటాన్ని అందరూ ఎక్స్ పెక్ట్ చేసేవారు. కానీ అసెంబ్లీకి వచ్చేందుకు ఆయన సుముఖంగా లేరని మాత్రం ఆ ఎక్స్ ప్రెషన్ తో అర్థమైపోతుంది. నిజంగా ఆయన అసెంబ్లీకి రాకపోతే రేవంత్ రెడ్డి వన్ సైడ్ బ్యాటింగ్ చేస్తారు. కేటీఆర్, హరీష్ సభలో ఉన్నప్పటికీ.. కేసీఆర్ ప్రతిపక్ష నేత. పదేళ్లు సీఎంగా ఉన్నారు. ఆయన చెబితేనే విలువ ఉంటుంది. లేకపోతే రేవంత్ చెప్పే మాటలే ప్రజల్లోకి వెళ్తున్నాయి. సోషల్ మీడియాలో.. బయట ఎంత ప్రచారం చేసుకున్నా.. అవేమీ వ్యాలీడ్ అవ్వవు.
బహిరంగసభలు పెట్టగలరా?. అసెంబ్లీకి సరిపోతాయా?
పదిహేను రోజుల్లో మూడూ బహిరంగసభలు పెడతానని కేసీఆర్ ప్రకటించారు. తాను కూడా వెళ్తానన్నారు. అదే సమయంలో అసెంబ్లీ జరుగుతుంది. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకుండా.. అసెంబ్లీలో రేవంత్ మాట్లాడేదానికి బహిరంగసభల్లో కౌంటర్ ఇస్తానని చెప్పడం చట్టసభల్ని అవమానించడమే అవుతుంది. అంటే ప్రజల్ని అవమానించడమే అవుతుంది. బహిరంగసభల్లోఏం మాట్లాడినా ప్రజలు దాన్ని ఎదురుదాడిగానే చూస్తారు కానీ చట్టబద్ధంగా చూడరు. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి హాజరవడం వల్లనే బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. లేకపోతే రేవంత్ రెడ్డి.. కేసీఆర్ విసిరిన వాటర్ బాల్‌ను సిక్సర్ కొట్టి.. మరోసారి విన్నర్‌గా నిలుస్తారు.
