తెలంగాణలో మళ్లీ కేబినెట్ చర్చలు..! కొంత మందికి పదవీ త్యాగం తప్పదట..!

తెలంగాణ కేబినెట్ లో మంత్రులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. వారు మంత్రులనే హోదాలో ఉన్నారు కానీ… కనీసం తమ వద్దకు వచ్చే విజ్ఞప్తులపై.. పరిశీలించాలని .. అధికారులకు రాసే లేఖలను కూడా.. ధైర్యంగా రాయలేకపోతున్నారు. కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారు చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఏడాది కూడా తిరగకుండానే డిప్యూటీ సీఎం రాజయ్యను సీఎం కేసీఆర్‌ బర్తరఫ్‌ చేశారు. ఆ భయం ఓ వైపు వెంటాడుతూండటంతో.. పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వరుస కడుతుండడంతో రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారతాయోననే ఆందోళన కూడా మంత్రుల్లో వ్యక్తమవుతోంది. మంత్రి పదవులు ఇచ్చే సమయంలో తమను బలి పశువును చేస్తారేమోనన్న ఆందోళన కొంత మందిలో ఉంది.

పైగా వరుసగా వస్తున్న ఎన్నికలు మంత్రులకు సవాల్‌గా మారాయి. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల బాధ్యతను జిల్లాలవారీగా మంత్రులే చూసుకున్నారు. టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకున్న 16కు 16 స్థానాలు గెలుస్తామని బయటికి చెబుతున్నా.. ఏదేని స్థానంలో పార్టీ అభ్యర్థి ఓడిపోవడం లేదా అసెంబ్లీ ఎన్నికల కంటే సెగ్మెంట్ల వారీగా మెజారిటీ తగ్గడం తమ రాజకీయ భవిష్యత్తుకు మంచిది కాదని ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌ సిటింగ్‌ ఎంపీలను మార్చి అక్కడ కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మంత్రి లేకపోయినా.. మిగిలిన స్థానాలకు సంబంధించి కేబినెట్‌లో మంత్రులకు ప్రాతినిధ్యం ఉంది. తమ ఒత్తిడితో అభ్యర్థులను మార్చిన పరిస్థితుల్లో.. కొత్తవారు ఓడిపోవడం లేదా మెజారిటీ తక్కువ రావడం జరిగితే తమ పరిస్థితి ఏమిటని వారు ఎక్కువ కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక, జిల్లా, మండల పరిషత్తు ఎన్నికలు కూడా మంత్రులకు ప్రతిష్ఠాత్మకమని వారి సన్నిహితులు చెబుతున్నారు. పరిషత్తు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించినా.. జిల్లాలవారీగా వారిని గెలిపించే భారం మంత్రులపైనే ఉందని అంటున్నారు. మంత్రులు ప్రాతినిధ్యం వహించే జిల్లాలో పార్టీ అభ్యర్థులు గెలవకపోతే, అది ఆ జిల్లా మంత్రి వైఫల్యం కిందికి వస్తుందని చెబుతున్నారు.

లోక్‌సభ, పరిషత్తు ఎన్నికల ఫలితాల తర్వాతే రాష్ట్ర కేబినెట్‌ను సీఎం కేసీఆర్‌ పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం కేబినెట్‌లో సీఎం కాకుండా గరిష్ఠంగా 17 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కేబినెట్‌లో సీఎం కాకుండా మంత్రులు 11 మంది ఉన్నారు. ఇంకా ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేబినెట్‌ పూర్తి స్థాయి విస్తరణ ఉంటుందని స్వయంగా సీఎం కేసీఆర్‌ చెప్పారు. దీంతో.. తమలో కొందరికి పదవులు మూన్నాళ్ల ముచ్చటేనని.. చెప్పక తప్పదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com