గతంలో చాలా సార్లు సర్జికల్ దాడులు జరిగాయి. అప్పుడున్న పాలకులు ఎవరూ కూడా ఆ వివరాలను బయట పెట్టలేదు. కానీ ఈ సారి మాత్రం కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడడంతో సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రజలందరికీ కూడా చెప్పాల్సి వచ్చింది. నరేంద్రమోడీ ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చోలేదు, పాకిస్తాన్‌కి సరైన సమాధానమే చెప్తోంది అన్న నమ్మకం ప్రజలకు కలిగేలా చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. సోషల్ మీడియా టూ మచ్ యాక్టివ్‌గా ఉన్న నేపథ్యంలో కొన్ని విషయాలు ప్రజలకు తెలియకపోతే అపోహలు, భయాలు చాలా పెరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దాడుల వివరాలను ప్రజలకు తెలియచేసింది. ప్రభుత్వాలు సాధించే ప్రతి విజయం కూడా అధికారంలో ఉన్న పార్టీకి రాజకీయంగా లాభిస్తుంది. ఒక్క నరేంద్రమోడీకి, బిజెపికి మాత్రమే కాదు…అధికారంలో ఎవరు ఉన్నా అలాగే జరుగుతుంది. కానీ మోడి రాజకీయంగా లాభపడతాడు అన్న పాయింట్ మాత్రం ఆయన ప్రత్యర్ధులకు నిద్రపట్టకుండా చేసినట్టుంది. వెంటనే విచక్షణ మర్చిపోయి విమర్శల దాడిమొదలెట్టేశారు. వేరే ఏదైనా విషయం అయితే విమర్శలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ అంతర్జాతీయ విషయాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయాలపైన కూడా ప్రజలకు, ప్రపంచానికి తెలిసేలా విమర్శలు చేయాల్సిన అవసరం ఉందా అన్నది ప్రశ్న. అయినా సర్జికల్ స్ట్రైక్స్‌కి సంబంధించిన ఆధారాలు బయటపెడతామని హోం మినిష్టర్ రాజ్‌నాథ్ సింగ్ చెప్పిన విషయం వీళ్ళకు వినపడలేదా?
అధికార హోదా లేని వాళ్ళు సోషల్ మీడియాలో, అలాగే ఇతర పబ్లిక్ ప్లాట్ ఫామ్స్‌పై ఆధారాలు ఉన్నాయా? సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా? అని ప్రజాముఖంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం గురించి పక్కన పెడితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్, పార్లమెంట్ మెంబర్ అయిన రాహుల్ గాంధీలాంటి వాళ్ళు పబ్లిక్‌గా ప్రశ్నించాల్సిన అవసరం ఉందా? డైరెక్ట్‌గా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని ఆయనను కలిసి మాట్లాడొచ్చుగా. వివరాలు తెలుసుకోవచ్చుగా. లేకపోతే కేంద్రప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రితోనైనా, అధికారులతోనైనా కలిసే అవకాశం ఈ నాయకులకు ఎప్పుడూ ఉంటుందిగా. వాళ్ళను కలిసి, కొంత రిసెర్చ్ వర్క్ చేశాక, అప్పుడు తాము శోధించి తెలుసుకున్న విషయాలలో ప్రజలకు నష్టం చేసేవో, ప్రజలను మోసం చేసినవో ఏవైనా ఉన్నాయి అనుకుంటే… అప్పుడు ఆ వివరాలను ప్రజలకు తెలియచేయవచ్చుగా. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకంటే గొప్పగా వాళ్ళు ఏం చేయగలరో చెప్పొచ్చుగా. అంత శ్రధ్ధ, సామర్ధ్యం ఉండి ఉంటే మోడీ కుర్చీలో కూర్చునే అవకాశం ఇలాంటి వాళ్ళకే ఇచ్చి ఉండేవాళ్ళు ప్రజలు.
అంతర్జాతీయ మీడియా, పాలకులు మొత్తం కూడా ఇండో-పాక్ ఇష్యూ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో దారినపోయే దానయ్యలు, కొంతమంది మీడియా వాళ్ళు, సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ మేధావుల లాంటి వాళ్ళు ఏదో వాగేశారని… ఆ మాటలు పట్టుకుని అధికార హోదాలో, బాధ్యతాయుత పదవులలో ఉన్నవాళ్ళు మాట్లాడడం మాత్రం దేశానికి చేటు చేస్తుంది. ఆల్రెడీ కేజ్రీవాల్ మాటలను పాకిస్తాన్ మీడియా, పాక్ పాలకులు ఆయుధంగా వాడేసుకుంటున్నారు. అంతర్జాతీయ సంబంధాలు, దేశ రక్షణకు సంబంధించిన విషయాలపైన స్పందించేటప్పుడు అయినా మోడీని బదనాం చేయాలి, పొలిటికల్ మైలేజ్ కొట్టేయాలి అన్న దుగ్ధ కాస్త తగ్గించుకుని ఆలోచనతో, వివేకంతో, ఆచితూచి స్పందిస్తే గౌరవంగా ఉంటుందేమో. హీరోలా రాజకీయ తెరంగేట్రం చేసి దశాబ్ధాలు గడుస్తున్నా ఇంకా ఓనమాల స్టేజ్ దాటని రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కానీ చాలా విషయాల్లో గొప్పగా అనిపించే కేజ్రీవాల్ కూడా నరేంద్రమోడీని విమర్శించే విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం అదుపు తప్పుతున్నాడు. ఆవేశపడుతున్నాడు. కేజ్రీవాల్‌కి రాజకీయంగా ఇబ్బందులు కలిగించడానికి ప్రధానమంత్రి మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట వాస్తవం. కానీ అది మనసులో పెట్టుకుని దేశ భద్రతకు, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన విషయాలపైన స్పందించేటప్పుడు కూడా బేలన్స్ తప్పడం మాత్రం ఆయన స్థాయికి తగదు. పైగా అది తన ఇమేజ్‌నే మసక బారుస్తుందన్న విషయం తెలుసుకుంటే కేజ్రీవాల్‌కే మంచిది.
