‘దేవర’ తరవాత కొరటాల శివ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. ‘దేవర 2’ ఉంటుందా? ఉండదా? ఉంటే ఎప్పుడు అనేది పెద్ద సస్పెన్స్. మొన్నటి వరకూ ‘దేవర 2’ ఊసు లేదు. అయితే సడన్ గా ‘దేవర 2’ వార్తల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కొరటాల శివకు సంబంధించిన ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.
రవితేజకు కొరటాల శివ ఓ కథ చెప్పారన్న వార్త రెండు మూడు రోజుల పాటు హల్ చల్ చేసింది. అంతకు ముందు పవన్ కల్యాణ్‌కు ఓ కథ చెప్పారని, అయితే ఆయన రిజెక్ట్ చేశారన్న టాక్ వినిపించింది. ఆ తరవాత `దేవర 2` మేలో సెట్స్ పైకి వెళ్తుందని అన్నారు. ఇప్పుడు సడన్ గా బాలయ్య లైన్ లోకి వచ్చారు. నందమూరి బాలకృష్ణ – కొరటాల శివ కాంబోలో ఓ సినిమా రాబోతోందని టాక్. ఇటీవల కొరటాల బాలయ్యని కలిసి, రెండు కథలు వినిపించారని, అందుకో ఓ కథ బాలయ్యకు కూడా నచ్చిందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై కూడా ఎలాంటి స్పష్టత లేదు.
‘దేవర 2’ గనుక ఓకే అయితే.. కొరటాలకు ఇప్పట్లో మరో కథపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. మే నుంచి ‘దేవర 2’ అనుకొంటే.. ఇప్పుడు కొత్త కథ రాసుకొని, హీరోల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏం వచ్చింది అనేది పెద్ద డౌటు. కొరటాల దగ్గర కొన్ని పవర్ ఫుల్ కథలు ఉన్నాయి. వాటికి హీరోలు కావాలి. ‘దేవర 2’ తరవాత చేయబోయే సినిమా గురించి ఇప్పటి నుంచూ హీరోల్ని లైన్ లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మరి కొరటాల విషయంలో ఏం జరుగుతోందో?
