‘నాకేంటి… అహ.. నా కేంటి అని అడుగుతున్నా’ – అంటూ ప్రతీదానికీ చేతులు చాచే లక్ష్మీపతి పాత్రని ఎలా మర్చిపోతాం? అహనా పెళ్లంటలో ట్రేడ్ మార్క్ పాత్ర అది. జంధ్యాల విశ్వరూపం చూపించిన పాత్ర అది. కోట శ్రీనివాసరావు అనే నటుడు విజృంభించిన పాత్ర అది.
ప్రతీ నటుడి కెరీర్‌కీ ఓ మైలురాయి లాంటి సినిమా ఉంటే.. కోట శ్రీనివాసరావు కెరీర్లో.. అది ‘అహనా పెళ్లంట’లోని లక్ష్మీపతి పాత్రే. కాలు విరిగి, అద్దం పగిలిన కళ్లజోడు, మాసిన పంచె, చిరిగిన బనీనూ.. లక్ష్మీపతి ట్రేడ్ మార్క్ గెటప్ అది. ‘అరగుండు’ బ్రహ్మానందంతో కోటని కలిపి జంధ్యాల పండించిన కామెడీ నభూతో.. అన్నట్టు సాగింది. ఇప్పటికీ ఆ సన్నివేశాలు మనల్ని నవ్విస్తూనే ఉన్నాయి. ఆ సినిమాతో కోట వెనక్కి తిరిగి చూసుకోలేదు. కామెడీలో తానెంత సిద్ధహస్తుడో ఆ సినిమాతోనే ప్రకటించుకొన్నారు కోట.
నిజానికి ఈ పాత్ర కోట కోసం పుట్టింది కాదు. రావు గోపాల్‌రావు కోసం అనుకొంది. జంధ్యాల స్క్రిప్ట్ అంతా రాశాక నిర్మాత రామానాయుడు చేతిలో పెట్టారు. సినిమా కంటే, కథ కంటే.. అందులో లక్ష్మీపతి పాత్రే రామానాయుడికి నచ్చింది. ‘ఈ సినిమాలో ఎవరే పాత్ర చేసినా నాకు పర్వాలేదు. కానీ లక్ష్మీపతిగా మాత్రం రావు గోపాల్‌రావు కావాలి’ అని ఆర్డరేశారు. అప్పట్లో రామానాయుడు చెప్పిందే వేదం. ఆయన సినిమా అంటే.. అన్నీ ఆయన చెప్పినట్టే జరగాలి. కానీ జంధ్యాల ఉద్దేశ్యాలు వేరే. ‘ఈ పాత్రకు స్టార్ నటుడు అవసరం లేదు. కొత్తవాళ్లతో చేయించడమే బెటర్’ అని నమ్మారు. ఇదే విషయం రామానాయుడుకి ధైర్యంగా చెప్పేశారు. రామానాయుడు మాత్రం ససేమీరా అన్నారు. లక్ష్మీపతి పాత్రలో ఎవరు నటిస్తారో తేల్చుకోక.. సినిమా షూటింగ్ సైతం వాయిదా వేశారు. 20 రోజుల పాటు తర్జన భర్జనలు పడ్డాక… జంధ్యాల ‘మండలాదీశుడు’ అనే సినిమా చూశారు. అందులో కోట అభినయం ఆయనకు బాగా నచ్చింది. వెంటనే.. ‘నా లక్ష్మీపతి ఇతనే’ అని ఫిక్సయ్యారు. రామానాయుడు ముందు ఒప్పుకోలేదు. కానీ చివరికి దర్శకుడి మాటకు విలువ ఇవ్వాల్సివచ్చింది.
`లక్ష్మీపతి పాత్ర పండితేనే సినిమా హిట్ అవుతుంది. లేదంటే పోతుంది.. ఆ తరవాత నీ ఇష్టం` అంటూ జంధ్యాల మీదకు వదిలేశారు రామానాయుడు. ఆ రిస్క్ తానే తీసుకొని, కోటని తీసుకొచ్చి పెట్టారు. ఆ తరవాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో కోట అనే ఆర్టిస్ట్ స్థిరపడిపోయాడు. అరగుండుగా బ్రహ్మానందం నిలబడిపోయారు. కొన్నికొన్నిసార్లు దర్శకుల జడ్జిమెంట్లు అలా ఉంటాయి. వాళ్ల ఆలోచనల్లోంచే స్టార్లు పుట్టుకొస్తారు. నిజంగా ఈ పాత్రని రావు గోపాల్‌రావు చేసి ఉంటే, ఆయన కెరీర్లో అది మరో మంచి పాత్ర అయ్యేది..అంతే. కోట లాంటి విలక్షణ నటుడు పుట్టుకొచ్చేవాడు కాదు.