ఏపీ లిక్కర్ స్కాం కేసులో జగన్ రెడ్డి రైట్ , లెఫ్ట్ హ్యాండ్లుగా ప్రసిద్ధి చెందిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో వారు మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం పడింది. ఈ నెల 26లోగా వారంతా కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంది. అంటే ఇరవై ఆరు నుంచి వారు మళ్లీ జైలుకు వెళ్తారు. మిథున్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది.
వీరంతా సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. తమను అరెస్టు చేసి 90 రోజులు అయిందని అయినా చార్జిషీటు దాఖలు చేయలేదని తమకు బెయిల్ కావాలని వీరు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పెట్టుకోవడంతో కోర్టు మంజూరు చేసింది. కానీ తాము సమయానికే చార్జిషీటు దాఖలు చేశామని కోర్టు పరిగణనలోకి తీసుకోకుండా.. డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిందని సీఐడీ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు..డిఫాల్ట్ బెయిల్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జైలుకు వెళ్లనున్నారు.
కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప.. లిక్కర్ స్కాంలో సొమ్ముల్ని జగన్ రెడ్డి రూటింగ్ చేశారు. వివిధ మార్గాల నుంచి అందుకున్న మొత్తాలను జగన్ కోసం పెట్టుబడులుగా మార్చడంలో కీలకంగా వ్యవహరించారు. వీరిపై ఆధారాలు స్పష్టంగా ఉండటంతో ఆరెస్టు చేశారు. అయినా డిఫాల్ట్ బెయిల్ పేరుతో బయటకు వచ్చారు. ఇప్పుడు సరెండర్ అయి రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఎవరికీ ఈ కేసుల్లో రెగ్యులర్ బెయిల్ రాలేదు.

