రాజ‌కీయ స‌న్యాసానికి సిద్ధ‌మంటూ కేటీఆర్ స‌వాల్‌..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌చార ప‌ర్వం రెండో ద‌శ‌కు చేరింద‌ని చెప్పొచ్చు! మొద‌టిది విమ‌ర్శ‌లూ ప్ర‌తి విమ‌ర్శ‌లు. ఇప్పుడు రెండోది… స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు..! ఈ క్ర‌మంలో ‘రాజ‌కీయ స‌న్యాసం’ అనే స‌వాల్ చాలా పాపుల‌ర్ క‌దా..! మంత్రి కేటీఆర్ అదే చేశారు. హైద‌రాబాద్ లో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ… రాబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో మ‌రోసారి తెరాస గెలుస్తుంద‌నీ, ఒక‌వేళ ప్ర‌భుత్వం ఏర్పాటు చెయ్య‌లేక‌పోతే తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని కేటీఆర్ స‌వాల్ చేశారు. ఈ స‌వాలును ప్ర‌తిప‌క్ష పార్టీలు స్వీక‌రిస్తారా, ఇదే త‌ర‌హాలో వారు ఛాలెంజ్ చెయ్య‌గ‌ల‌రా అంటూ ప్ర‌శ్నించారు?

ముఖ్య‌మంత్రి కావాల‌నే ఆశ త‌న‌కు లేద‌న్నారు. ఎన్నిక‌ల త‌రువాత ఆ ప‌ద‌వి త‌న‌కే అంటూ జ‌రుగుతున్న చ‌ర్చ కేవ‌లం క‌ల్పిత ప్ర‌చారం మాత్ర‌మేన‌నీ, మ‌రో ప‌దిహేనేళ్ల‌పాటు కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉండాలన్నారు. ప్ర‌స్తుతం తాను నిర్వ‌హిస్తున్న మంత్రి ప‌ద‌వే చాలా పెద్ద‌ది అనుకుంటున్నాన‌నీ, అది కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌య‌వ‌ల్ల త‌న‌కు ద‌క్కింద‌ని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కి చెప్పుకుండానే తాను ఉద్యోగానికి రాజీనామా చేసి మ‌రీ ఉద్య‌మంలో ప‌నిచేయ‌డానికి వ‌చ్చాన‌నీ, ఆయ‌న నాయ‌క‌త్వంలోనే మ‌రింత అభివృద్ధి సాధించే దిశ‌గా తాను కృషి చేయాల‌నుకుంటున్నాన‌ని అన్నారు. తెరాస అధికారంలోకి వ‌చ్చాక గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో ఎక్క‌డా క‌ర్ఫ్యూలు విధించ‌లేద‌ని గుర్తుచేశారు. శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో తాము రాజీప‌డ‌లేద‌నీ, అవినీతి ర‌హితంగా నాలుగున్న‌రేళ్ల పాల‌న అందించామ‌న్నారు. పాల‌న‌లో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తెచ్చామ‌నీ, తెలంగాణ‌లో అమ‌లైన ప‌థ‌కాలు దేశ‌వ్యాప్తంగా ఆద‌ర్శంగా నిలిచాయ‌న్నారు. కేసీఆర్ పాల‌న‌ను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మెచ్చుకున్న సంద‌ర్భం కూడా ఉంద‌న్నారు.

ఇక‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని ఉద్దేశించి మాట్లాడుతూ… ఆయ‌న ఎప్పుడూ స్వ‌యం ప్ర‌కాశం లేని చంద్రుడు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయ‌న భ‌విష్య‌త్తులో వైకాపాతో కూడా పొత్తు పెట్టుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఆయ‌న‌కు అవ‌కాశం మాత్ర‌మే ముఖ్య‌మన్నారు. అధికారం త‌మ‌దే, రాక‌పోతే రాజ‌కీయ స‌న్యాస‌మే అంటూ స‌వాల్ చేయ‌డం ద్వారా ప్ర‌తిప‌క్షాల‌ను మాన‌సికంగా ప్ర‌భావితం చెయ్యొచ్చ‌నేది కేటీఆర్ వ్యూహం. ఎన్నిక‌ల్లో విజ‌యంపై చాలా న‌మ్మ‌కంగా ఉన్నామ‌నే సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌నేదే ఇలాంటి వ్యాఖ్య‌ల వెన‌క ఉండే ఉద్దేశం. ఇంకోటి.. ఈ రాజ‌కీయ స‌న్యాసం స‌వాళ్లు ముందు ఎవ‌రు చేస్తారో వారికే కొంత అడ్వాంటేజ్ ఉన్న‌ట్టుగా అనిపిస్తుంది! మ‌రి, కేటీఆర్ స‌వాలు మీద ప్ర‌తిప‌క్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com