కేటీఆర్,లోకేష్ మధ్య భేటీ జరిగిందని కొంత కాలంగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. లోకేష్‌తో కేటీఆర్ అర్థరాత్రి డిన్నర్ మీటింగ్ నిర్వహించారని ప్రకటించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్.. నాకా లోకేష్‌తో డిన్నర్ మీటింగ్ ఎందుకో చెప్పాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు.
గతంలో సామ రామ్మోహన్ రెడ్డి కూడా ఇవే ఆరోపణలు చేశారు. కేటీఆర్.. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోకేష్‌తో కూడా సమావేశం అయ్యారని అన్నారు. ఈ ఆరోపణలు చేసిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఖండించలేదు. కనీసం స్పందించలేదు. టీడీపీకి తెలంగాణ రాజకీయాల్లో చేస్తున్న ఈ ప్రకటనలపై స్పందించాల్సిన అవసరం కనిపించలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ కూడా అదే మాట చెప్పడం ఆసక్తికరంగా మారింది.
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం లేదు. పోటీ విషయంలో ఎలాంటి ఆసక్తి వ్యక్తం చేయలేదు. అసలు తెలంగాణ టీడీపీకి ఇంత వరకూ అధ్యక్షుడు లేరు. కానీ ఏపీలో ఎన్డీఏ ఉంటుంది కాబట్టి..ఇక్కడ బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతిస్తుందని భావిస్తున్నారు. అయితే బీజేపీకి కాకుండా.. తమకు మద్దతు ఇవ్వాలని.. మాగంటి గోపీనాథ్ కుటుంబసభ్యులకే టిక్కెట్ ఇస్తామని అన్నట్లగా తెలుస్తోంది. ఈ సమావేశం నిజంగా జరిగిందా లేదా.. జరిగితే ఎందుకు జరిగింది.. లోకేష్ స్పందనేమిటి అన్నది కేటీఆర్, లోకేష్లలో ఎవరైనా బయటపెడితేనే తెలుస్తుంది.