దిగ్గజ ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఒరాకిల్ లే ఆఫ్స్.. ఓ సునామీలా మీదపడ్డాయి. గూగుల్ , మైక్రోసాఫ్ట్, మెటా , అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు కూడా అదే బాటలో నడుస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే చాలా వరకూ లేఆఫ్స్ ప్రకటించారు. అయితే ఈ సంస్థల ప్రస్తుత ఆర్థిక ఫలితాలను గమనిస్తే, అవి బిలియన్ల కొద్దీ డాలర్ల లాభాలను ఆర్జిస్తున్నాయి. అయినప్పటికీ, 2024 ప్రారంభం నుండి ఇప్పటివరకు వేలాది మంది ఉద్యోగులను ఈ కంపెనీలు ఇంటికి పంపించాయి.
ఏఐ పెట్టుబడులకు నిధుల మళ్లింపు
దీనికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ . సాంప్రదాయ ఐటీ సేవల కంటే, ఏఐ రంగంలో పెట్టుబడులు పెడితేనే భవిష్యత్తు ఉంటుందని ఈ కంపెనీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఏఐ రేసులో వెనుకబడితే నోకియా లేదా కొడక్ లాగా తమ కంపెనీలు కూడా కనుమరుగవుతాయనే భయం ఈ నిర్ణయాల వెనుక ప్రధానంగా కనిపిస్తోంది. కేవలం 2024 మొదటి మూడు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 200కి పైగా టెక్ కంపెనీలు దాదాపు 50,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. గూగుల్ తన అడ్వర్టైజింగ్, సేల్స్ విభాగాల్లో వందలాది మందిని తొలగించి, ఆ నిధులను ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చిప్ డెవలప్మెంట్ వైపు మళ్లిస్తోంది. మైక్రోసాఫ్ట్ సైతం తన గేమింగ్ , క్లౌడ్ విభాగాల్లో కోతలు విధిస్తూ, ఓపెన్ ఏఐ వంటి భాగస్వామ్యాల్లో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. అంటే, ఇక్కడ సమస్య డబ్బు లేకపోవడం కాదు, ఉన్న డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే ప్రాధాన్యతలు మారడమే.
మార్పు కోసం పరుగులు పెడుతున్న ఐటీ ఇండస్ట్రీ
ఐటీ కంపెనీలకు ఇప్పుడు లాభం కంటే వేగం ముఖ్యం. మానవ వనరుల ద్వారా జరిగే పనులను ఏఐ టూల్స్ వేగంగా, తక్కువ ఖర్చుతో చేస్తున్నప్పుడు, అదనపు సిబ్బందిని కొనసాగించడం భారంగా భావిస్తున్నాయి. గతంలో కోవిడ్ సమయంలో అవసరానికి మించి రిక్రూట్ చేసుకున్న సిబ్బందిని ఇప్పుడు రీస్ట్రక్చరింగ్ పేరుతో తొలగిస్తూ ఆ సేవింగ్స్‌ను ఏఐ సర్వర్లు, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల కొనుగోలుకు ఉపయోగిస్తున్నాయి. ఇది ఒక రకంగా ఉద్యోగుల స్థానంలో యంత్రాలను ప్రతిష్టించే ప్రక్రియగా మారిపోయింది.
అప్ డేట్ అవ్వకపోతే అవుట్ డేట్
లేఆఫ్స్ అనేవి ఐటీ రంగంలో ఒక పరివర్తన దశ కు సంకేతం. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నుండి ఏఐ ఇంజనీరింగ్ వైపు ప్రపంచం వేగంగా మారుతోంది. కంపెనీలు తమ మనుగడ కోసం పాత నైపుణ్యాలు కలిగిన వారిని తొలగించి, ఏఐ ఆధారిత వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. లాభాలు వస్తున్నా ఉద్యోగులను తీసేయడం అనేది క్రూరంగా అనిపించినా, టెక్ ప్రపంచంలో అప్ డేట్ అవ్వకపోతే అవుట్ డేట్ అవుతాం అనే సూత్రాన్ని ఇవి అక్షరాలా అమలు చేస్తున్నాయి. ఈ పరిణామం ఐటీ ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది.
