రివ్యూ : మాస్ట్రో

మంచి క‌థ‌ని ఎంత చెత్త‌గా తీసినా చూడొచ్చు చెత్త క‌థ‌ని ఎంత బాగా చెప్పాల‌నుకున్నా చూడ‌లేం – అన్న‌ది సినిమా వాళ్లు న‌మ్మే మాట.

అందుకే మంచి క‌థ‌లు ఎక్క‌డైనా స‌రే చ‌లామ‌ణీ అయిపోతుంటాయి. రీమేక్‌ల పేరుతో ప‌క్క సినిమాల క‌థ‌ల్ని కొనుక్కొచ్చేది అందుకే. అయితే కొన్ని క‌థ‌ల‌కు భాష‌, ప్రాంతీయ‌త అనే స‌రిహద్దులు ఉంటాయి. కొన్ని క‌థ‌ల‌కు అవి కూడా ఉండ‌వు. అలాంటి క‌థ `అంధాధూన్‌`. ఓ గుడ్డివాడు కాని గుడ్డి వాడి క‌థ‌. ఓ హ‌త్య చుట్టూ ఈ క‌థ తిరుగుతుంది.  క‌థ ఎత్తుగ‌డ‌, అందులోని మ‌లుపులు – ప్రేక్ష‌కుల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. 2018లో బాలీవుడ్ లో వ‌చ్చిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. అప్ప‌ట్లోనే సంచ‌ల‌నాలు సృష్టించింది. మూడేళ్ల త‌ర‌వాత ఈ సినిమాని తెలుగులో `మాస్ట్రో` పేరుతో రీమేక్ చేశారు. ఇప్పుడు డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

అరుణ్ (నితిన్‌) ఓ పియానో ప్లేయ‌ర్‌. క‌ళ్లు లేని వాళ్ల‌కు ఫోక‌స్ ఎక్కువ అని న‌మ్ముతాడు. అందుకే మ్యూజిక్ పై ఫోక‌స్ కోసం.. తాత్కాలికంగా గుడ్డివాడిగా మారిపోతాడు. త‌న‌కు క‌ళ్లు లేవ‌న్న విష‌యం బ‌య‌టి ప్ర‌పంచం మొత్తం న‌మ్మేస్తుంది. సోఫీ (న‌భా న‌టేషా) అరుణ్‌ని బాగా ఇష్ట‌ప‌డుతుంది. అరుణ్ కూడా సోఫీ సాంగ‌త్యాన్ని కోరుకుంటూ ఉంటాడు. మోహ‌న్ (న‌రేష్‌) అరుణ్ కి పెద్ద ఫ్యాన్‌. త‌న పెళ్లిరోజున‌… అరుణ్ ని ఇంటికి పిలిచి… త‌న సంగీతాన్ని ఆస్వాదించాల‌నుకుంటాడు. అయితే అదే రోజు. మోహ‌న్ హ‌త్య‌కు గుర‌వుతాడు. ఈ హ‌త్య ఎవ‌రు చేశారు?  ఈ హ‌త్య‌ని క‌ళ్లారా చూసిన అరుణ్ ఈ విష‌యాన్ని పోలీసుల‌కు చెప్పాల‌నుకుంటే అక్క‌డ మ‌రో ట్విస్ట్ ఎదుర‌వుతుంది. మ‌రి ఈ నిజాన్ని అరుణ్ బ‌య‌టి ప్ర‌పంచానికి ఎలా చెప్పాడు?  ఆ క్ర‌మంలో త‌న‌కు ఎదురైన అనుభ‌వాలేంటి?  ఈ మొత్తం క‌థ‌లో సిమ్ర‌న్ (త‌మ‌న్నా) పాత్రేమిటి?  ఇవ‌న్నీ వెండి తెర‌పై చూడాల్సిందే.

ముందే చెప్పిన‌ట్టు `అంధాధూన్‌` ఓ గ‌మ్మ‌త్తైన క‌థ. తెలివైన స్క్రీన్ ప్లేకి నిద‌ర్శ‌నం. నిజానికి అంధాధూన్ కంటే ముందు ఇలాంటి కాన్సెప్ట్ లో ఓ ఫ్రెంచ్ షార్ట్ ఫిల్మ్ వ‌చ్చింది. ఆ స్ఫూర్తితోనే అంధాధూన్ అనేక‌థ త‌యారు చేసుకున్నారు. అంధాధూన్‌ టైటిల్స్ లో ఆ క్రెడిట్ ఇచ్చార‌నుకోండి. అయితే ఆ పాయింట్ ని సినిమాటిక్ గా మ‌ల‌చ‌డంలో `అంధాధూన్‌` విజ‌య ర‌హ‌స్యం దాగుంది. అస‌లు హీరో క్యారెక్ట‌రైజేష‌న్ లోనే ఓ ట్విస్ట్ ఉంది. హీరోని గుడ్డివాడు అనుకునే సినిమా చూడ‌డం మొద‌లెడ‌తారు ప్రేక్ష‌కులు. స‌డ‌న్ గా త‌న‌కు క‌ళ్లు ఉన్నాయ‌ని తెలిసి థ్రిల్ అవుతారు. ఇక అక్కడి నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. మోహ‌న్ హ‌త్య – ఆ ఇంట్లో జ‌రిగే ప‌రిణామాల‌తో క‌థ వేడెక్కుతుంది. అస‌లు అరుణ్  కి క‌ళ్లున్నాయా, లేదా?  అనే విష‌యాన్ని తెలుసుకోవ‌డం కోసం సిమ్రాన్‌, పోలీస్ ఆఫీస‌ర్ చేసే ప్ర‌య‌త్నాలు.. మ‌రింత ఉత్కంఠ‌త‌ని పెంచుతాయి. ఇక సెకండాఫ్ మ‌రింత జోరుగా సాగుతుంది. క్లైమాక్స్ వ‌ర‌కూ ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌దు. క్లైమాక్స్‌లోనూ ఓ ట్విస్ట్ వ‌స్తుంది.

అంధాధూన్ ని మార్చాల‌నో, కొత్త‌గా త‌నేదో చూపించుకోవాల‌నో ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ ప్ర‌య‌త్నించ‌లేదు. త‌న మార్పులూ చేర్పులూ పెద్ద‌గా క‌నిపించ‌లేదు. అదే స‌మ‌యంలో.. మాతృక‌ని పాడుచేయ‌లేదు. నితిన్ లాంటి హీరో ఉన్నాడు కాబ‌ట్టి, త‌న ఎన‌ర్జీని వాడుకుంటూ, ఆ పాత్ర‌ని జోవియ‌ల్ గా మార్చాల‌ని తాప‌త్ర‌యం ప‌డ‌లేదు. ప్ర‌తీ క్యారెక్ట‌ర్ కీ, ప్ర‌తీ స‌న్నివేశానికీ ద‌ర్శ‌కుడి పేరామీట‌ర్ ఒక్క‌టే… అంధాధూన్‌. ఆ సినిమా చూడ‌కుండా.. `మాస్ట్రో`ని చూస్తే…క‌చ్చితంగా థ్రిల్ ఇస్తుంది. `అంధాధూన్‌` చూసిన వాళ్ల‌కు మాత్రం ఈ సినిమా జిరాక్స్‌లా అనిపిస్తుంది. ఈ క‌థ‌కు ప్రాణం ట్విస్టులే. అవి ముందే తెలిసిపోతే ఇక కిక్కేముంటుంది?  ర‌న్ టైమ్ విష‌యంలో ద‌ర్శ‌కుడు చాలా కేర్ తీసుకున్నాడు. 135 నిమిషాల్లోనే క‌థ ముగించాడు. ఈ సినిమాలో రెండే రెండు పాట‌లు. అవి కూడా క‌థ‌కేం అడ్డు ప‌డ‌వు. చివ‌ర్లో ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ బోన‌స్‌. కుందేలు ద‌గ్గ‌ర్నుంచి, అరుణ్ ని ప‌ట్టించాల‌నుకునే ఓ పిల్లాడి పాత్ర వ‌ర‌కూ – ప్ర‌తీ పాత్రా కీల‌క‌మే. ఈ సినిమాలో వేస్టేజ్ అనేది క‌నిపించ‌దు. ఇదంతా అంధాధూన్ మాతృక స్క్రిప్టు రూపొందించ వాళ్ల ఘ‌న‌తే.

నితిన్ ఫాలోయింగ్ కీ, త‌న ఇమేజ్‌కి త‌గిన క‌థేం కాదిది. కానీ ఈ సినిమా ఒప్పుకున్నాడు. దానికి కార‌ణం.. త‌న‌లోని న‌టుడ్ని కొత్త‌గా చూపించుకోవాల‌నుకునే. ఆ ప‌నిని స‌క్ర‌మంగా నిర్వ‌హించాడు. క‌ళ్లు ఉండి కూడా లేన‌ట్టు న‌టించ‌డం, నిజంగా లేన‌ప్పుడు అవి లేవ‌న్న బాధ క‌న‌బ‌ర‌చ‌డం నితిన్ ప‌ర్‌ఫెక్ట్ గా చేశాడు. ఓ ర‌కంగా తాను కూడా ఆయుష్మాన్ ఖురానాని ఫాలో అయిపోయాడు. కాక‌పోతే.. నితిన్ కెరీర్‌లో మ‌ళ్లీ ఇలాంటి క్యారెక్ట‌ర్ చేసే అవ‌కాశం రాదేమో…? ఇక త‌మన్నాకీ ఇది కొత్త త‌ర‌హా పాత్ర‌. ఓ ర‌కంగా ఈ సినిమా మొత్తానికి తానే విల‌న్‌. ట‌బుని మించిపోయి న‌టించింది అన‌లేం గానీ, ఆ పాత్ర వైశిష్టాన్ని తాను కాపాడింది. న‌రేష్ కూడా ఓకే. ఇక మిస్ మ్యాచ్ అయ్యింది మాత్రం న‌భా న‌టాషానే. త‌ను బాగా ముదిరిపోయ‌న ఫీలింగ్ వ‌స్తుంది ఈ సినిమా చూస్తుంటే. త‌న ప్రాధాన్యం త‌క్కువే.

టెక్నిక‌ల్ గా మాస్ట్రో క్లాస్ లుక్‌, మేకింగ్ తో సాగింది. గోవా లో తీసిన సినిమా ఇది. ఆ వాతావ‌ర‌ణం ఈ క‌థ‌కు ప్ల‌స్ అయ్యింది. నేప‌థ్య సంగీతం.. `మాస్ట్రో` టైటిల్ కి త‌గ్గ‌ట్టుగా మెలోడీయ‌స్ గా సాగింది. ముఖ్యంగా పియానో ప్లే చేసిన‌ప్పుడ‌ల్లా.. హాయిగా అనిపిస్తుంది. మేర్ల‌పాక‌.. `అంధాధూన్‌` ఆత్మ‌ని బాగా అర్థం చేసుకున్నాడు. దాన్ని తెలుగు తెర‌పై త‌ర్జుమా కూడా చేశాడు. త‌న‌వంటూ మార్పులు చేయ‌లేక‌పోవ‌డం త‌ప్ప‌… మిగిలిన అన్ని విష‌యాల్లోనూ ఓకే.

హిందీ సినిమా చూసేసిన‌వాళ్లు పోలిక‌లు వెదుక్కుంటారు కానీ, తెలుగులో తొలిసారి `మాస్ట్రో` చూస్తే.. ఓ కొత్త త‌ర‌హా క్రైమ్ కామెడీ చూసిన అనుభూతి మాత్రం త‌ప్ప‌కుండా క‌లుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఇరుక్కుపోనున్న వైసీపీ !

వైసీపీకి తెలంగాణ పెద్ద చిక్కుముడిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ కంటే ముందే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో వైసీపీ లేదు. కానీ ఆ పార్టీకి కొంచెం ఓటు బ్యాంక్ ఉంది. ...

మునుగోడులో కాంగ్రెస్ కు మేలు చేసేలా టీఆర్ఎస్ ప్లాన్ !?

" మునుగోడు ఉపఎన్నిక చిన్నదే. దాని వల్ల వచ్చేదేం ఉండదు.. పోయేదేం ఉండదు " అని మంత్రి కేటీఆర్ ఇటీవల నెటిజన్లతో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు...

మాధవ్ ఫిర్యాదు మీదే విచారణ చేస్తున్నారట !

న్యూడ్ వీడియో విషయంలో ఎంపీ మాధన్‌ను రక్షించడమే కాదు.. బాధితుడిగా చూపించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అంశం ఎంతకీ సద్దుమణగకపోతూండటం .. విచిత్రమైన రియాక్షన్స్‌తో అందరూ ప్రజల దృష్టిలో చులకన అవుతూండటంతో...

ఖాళీగా ఉన్న నేతలందరికీ బీజేపీ నుంచి ఆహ్వానాలు !

తెలంగాణలో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయని చెప్పడానికో .. లేకపోతే సీనియర్ నేతల అవసరం ఉందనుకుంటున్నారో కానీ తెలంగాణలో ఖాళీగా ఉన్న నేతలందరికీ బీజేపీ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. చేరికల కమిటీ చైర్మన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close