వేసవి మొదలైతే.. మహేష్ బాబు విహార యాత్రకు వెళ్లిపోతాడు. ప్రతీ యేటా ఇదే జరుగుతోంది. అయితే రాజమౌళి సినిమా అనేసరికి మహేష్ మారతాడని, తనకు సెలవలు దక్కే ఛాన్స్ ఉండదని అనుకొన్నారంతా. కానీ మహేష్ మారలేదు. రాజమౌళి సినిమా అయితేనేం బ్రేక్.. బ్రేకే, సెలవలు సెలవలే. ఇప్పుడు ఈ సినిమాకు బ్రేక్ వచ్చింది. అది కూడా వేసవి సెలవలు కోసం.
ప్రస్తుతం హైదరాబాద్ శివారల్లో ఈ సినిమా కోసం ఓ పాట తెరకెక్కిస్తున్నారు. మహేష్, ప్రియాంకా చోప్రా ఈ షూట్ లో పాలు పంచుకొన్నారు. ఈ రోజుతో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. రేపటి నుంచి 40 రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు రాజమౌళి. తిరిగి జూన్ 10న షూటింగ్ మొదలు కానుంది. ఈసారి వారణాసి సెట్లో కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఈ సెట్ కి సంబంధించిన పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి.
ఈ 40 రోజులు మహేష్ విదేశాలకు వెళ్లే ఛాన్సుంది. రాజమౌళి కూడా విహార యాత్రకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026లో ఈ సినిమా విడుదల చేస్తారని అనుకొన్నారు. అయితే 2027 వరకూ ఆగకతప్పదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫృధ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న సినిమా ఇది. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. నానా పటేకర్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే చిత్రబృందం ఇంకా ఖరారు చేయలేదు.