పీపీపీ విధానాన్ని సమర్థించిన న్యాయమూర్తుల్ని జైల్లో పెడతారా?. పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేపడుతున్న ప్రధాని మోదీని నిందిస్తారా? దమ్ముంటే నన్ను జైల్లో పెట్టు .. అని ఏపీ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్..వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. పీపీపీ విధానం దేశంలోనే పెద్ద స్కాం అంటూ జగన్ రెడ్డి చేసిన ఆరోపణలతో పాటు .. మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు వచ్చే వారిని భయపెట్టేందుకు జగన్ రెడ్డి చేసిన .. జైలు హెచ్చరికలకు మంత్రి సత్యకుమార్ ఇలా కౌంటర్ ఇచ్చారు.
ఏపీ వైద్య శాఖా మంత్రిగా సత్యకుమార్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన శాఖలో ఉన్న మెడికల్ కాలేజీల వ్యవహారాన్నే టార్గెట్ చేసుకున్నారు. పీపీపీ అంటే పూర్తి స్థాయి ప్రైవేటీకరణ కాకపోయినా ప్రైవేటీకరణ అంటూ అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి సత్యకుమార్ ఎప్పటికప్పుడు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి సత్యకుమార్ కు సమాధానం చెప్పేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. సత్యకుమార్ బీజేపీ నేత కావడంతో ఆయనను టార్గెట్ చేస్తే బీజేపీ పెద్దలకు కోపం వస్తుందని ఆయన విమర్శించినా సైలెంట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
కానీ సత్యకుమార్ చాలా మంది బీజేపీ నేతల్లా కాదు. ఆయన గతం నుంచి జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించేవారు. అందుకే ఆయనను జగన్ లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. భారతీయ జనతాపార్టీని నేరుగా లక్ష్యం చేసుకోకుండా.. పరోక్షంగా ఆ పార్టీకి చెందిన మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించడం ద్వారా బీజేపీని దెబ్బతీయాలని జగన్ ప్లాన్ చేసుకుంటున్నారని బీజేపీ నేతలకు క్లారిటీ వచ్చింది. అందుకే జగన్ పై విరుచుకుపడుతున్నారు.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన విందు సమావేశంలోనూ …జగన్ చేస్తున్న విమర్శలపై ఘాటుగా సమాధానం ఇవ్వాలని ఎంపీలకు సూచించారు. జగన్ వ్యూహాత్మకంగా బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నాలు చేయడంతో ఇక నుంచి అంతా వైసీపీ సర్కార్ పై పెద్ద ఎత్తున ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. జగన్ ఆరోపణల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టనున్నారు.
