అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. భారత ఉత్పత్తులపై 25 శాతం పన్ను విధించడంతో వ్యాపారపరమైన సమస్యలు ప్రారంభమవుతున్నాయి. అయితే ట్రంప్ ట్రేడ్ డీల్ ఏకపక్షంగా.. అమెరికా ఉత్పత్తుల్ని ఇండియాలో డంప్ చేసేలా ఉండేలా పట్టుబడుతున్నారు. దానికి ప్రధాని మోదీ అంగీకరించడం లేదు. దాంతో ట్రేడ్ డీల్ కుదరలేదు. కుదరకపోయినా పర్వాలేదు.. ఎలాగోలా ఎదుర్కోవాలన్నట్లుగా భారత ప్రభుత్వం ఉంది. అందుకే ఇండియాలోనే అమెరికా ఎగుమతులపై ప్రభావం పడే వాటికి డిమాండ్ పెంచాలని భావిస్తున్నారు.
అందుకే.. స్వదేశీ నినాదాన్ని వినిపించారు. తన సొంత నియోజకవర్గం వారణాశి నుంచి రైతుల ఖాతాల్లో రూ. 2వేలు జమ చేసే కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ట్రేడ్ డీల్ ప్రస్తావన తీసుకు రాలేదు కానీ.. పరోక్షంగా ట్రంప్ పన్నుల ప్రభావం గురించి మాట్లాడారు. దేశీయ వస్తువులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచం అస్థిరత వాతావరణంలో ఉన్నప్పుడు అన్ని దేశాలు వాటి ప్రయోజనాలను చూసుకుంటున్నాయన్నారు. మనం కూడా అలాగే చేసి.. స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. రాబోయే పండుగల్లో అదే పని చేయాలన్నారు.
భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉందని, అందుకే దేశం తన ఆర్థిక ప్రయోజనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ అన్నారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా, భారతీయులు గాంధీ ఆదర్శాలను సమర్థించడమే కాక, దేశ ఆర్థిక బలాన్ని పెంపొందించవచ్చని ఆయన సలహా ఇచ్చారు. ట్రేడ్ డీల్ విషయంలో అమెరికా షరతులకు తలొగ్గితే భారతీయ వ్యాపారులకు , చిన్న పరిశ్రమలకు భారీ నష్టం జరుగుతుందన్న అభిప్రాయం కారణంగా ట్రేడ్ డీల్‌కు భారత్ సిద్ధంగా లేదన్న ప్రచారం జరుగుతోంది.