పవన్ కల్యాణ్ నుంచి గతేడాది రెండు సినిమాలు వచ్చాయి. ‘వీరమల్లు’ ఫ్లాప్ అయితే ‘ఓజీ’ సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా త్వరలో పట్టాలెక్కబోతోంది. ఈలోగా పవన్ మరో సినిమాకూ సంతకం చేసేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో పవన్ ఓసినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కథలు వింటోంది. పలువరు దర్శకుల్ని పవన్ దగ్గరకు పంపింది. అయితే ఒక్క కథ కూడా పవన్ కి నచ్చడం లేదు.
తాజాగా తమిళ దర్శకుడు మోహన్ రాజా ఓ కథ చెప్పినట్టు టాక్. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి ఈయనే దర్శకుడు. మోహన్ రాజాకు స్టైలీష్ దర్శకుడగా పేరుంది. రామ్ చరణ్ ‘ధృవ’ మాతృక అయిన ‘తని ఒరువన్’కి ఆయనే దర్శకుడు. సినిమాని చాలా వేగంగా పూర్తి చేయగల సమర్థుడు. పవన్ కల్యాణ్ కి కావాల్సింది అదే. తక్కువ కాల్షీట్లలో సినిమాని పూర్తి చేసే దర్శకుడి కోసం వెదుకుతున్నారు. ‘ఉస్తాద్’ కోసం పవన్ ఇచ్చిన కాల్షీట్లు 45 మాత్రమే. సురేందర్ రెడ్డి కి కూడా ఇంచుమించు ఇన్నే కాల్షీట్లు ఇస్తారు. అలానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాని కూడా త్వరిత గతిన పూర్తి చేయాలనుకొంటున్నారు. ప్రస్తుతం మోహన్ రాజా కథని పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉన్నారు. పవన్ ఓకే అంటే.. ఈ కాంబో సెట్టయిపోయినట్టే.


