చిత్రసీమకు చాలా సమస్యలున్నాయి. పైరసీ, ఓటీటీ, ఫుట్ ఫాల్స్ సమస్యలతో సతమతమైపోతోంది. ఇక మితిమీరిన బడ్జెట్ మరో గుది బండ. దాంతో పాటు లీకేజీల బెడద ఒకటి. సెట్లోంచి సీన్లు లీకైపోవడం, ఎడిటింగ్ రూమ్ నుంచి సీన్లకు సీన్లు ముందే బయటకు వెళ్లిపోవడం లాంటి ఉదంతాలతో చిత్రసీమలో కలవరం మొదలైంది. ‘జననాయగన్’ సినిమాకు సంబంధించి ఓ పాట, ఓ సీన్ హై క్వాలిటీతో బయటకు వచ్చేయడంతో కలకలం రేగింది. తమిళ చిత్రసీమ కు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. లీకేజీ వ్యవహారం ప్రభుత్వం తలకూ చుట్టుకొంది. ప్రభుత్వ పెద్దల హస్తం ఈ లీకేజీ వెనుక ఉందన్నది ప్రధాన ఆరోపణ. ఈ లీకేజీ కేసుని పోలీసులూ సీరియస్ గా తీసుకొని దర్యాప్తు మొదలెట్టారు. అరెస్టులూ జరుగుతున్నాయి.
మరోవైపు ‘వారణాసి’ కి కూడా ఈ లీకుల బెడద తప్పలేదు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిందో లేదో, సెట్లోంచి ఓ సీన్ బయటకు వచ్చేసింది. దాంతో రాజమౌళి అండ్ టీమ్ అలెర్ట్ అయ్యింది. తగిన జాగ్రత్తలతో షూటింగ్ చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో సీన్ బయట హల్ చల్ చేస్తోంది. ఇది కూడా సెట్లోంచి బయటకు వచ్చేసిన సీనే. షూటింగ్ సమయంలో క్రూతో సహా ఎవ్వరి సెల్ ఫోన్లని అనుమతించం లేదు. అయినా సరే, ఈ లీకులు ఎక్కడి నుంచి జరుగుతున్నాయో అర్థం కావడం లేదు.
సెట్లో.. నాలుగు గోడల మధ్య షూటింగ్ జరిగితే ఎలాంటి ఇబ్బందీ ఉండడం లేదు. బయట వాళ్లు ఎవరూ లోపలకు వచ్చే అవకాశం లేదు కాబట్టి, లీకుల బెడద తప్పుతుంది. అందుకే పెద్ద సినిమాలన్నీ ఇప్పుడు స్టూడియోకే పరిమితం అవుతున్నాయి. అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా మొత్తం సెట్లోనే జరుగుతోంది. అందుకే లీకుల బాధ లేదు. ఈ లీకుల బాధ తప్పించుకోవడానికైనా ఇక నుంచి పెద్ద సినిమాలన్నీ స్టూడియోలోనే చిత్రీకరణకు మొగ్గు చూపుతాయేమో. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చిత్రబృందాలు తీసుకొంటే తప్ప ఈ లీకుల్ని ఆపలేరు. దాంతో పాటు ఇలాంటి లీకులకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షిస్తే తప్ప.. ఈ సమస్యకు పరిష్కారం దొరకదు.
