Mowgli Movie Review
Telugu360 Rating: 1.75/5
‘మోగ్లీ’ అనే ఓ చిన్న సినిమా జనాల్ని ఆకర్షించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ‘కలర్ ఫొటో’ సినిమాతో జాతీయ అవార్డు సాధించిన సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం, ఇండిపెండెంట్ సినిమాల ద్వారా నటుడిగా పేరు తెచ్చుకొన్న బండి సరోజ్ని విలన్‌గా ఎంచుకోవడం, యాంకర్లలో టాప్ స్టార్‌గా గుర్తింపు సంపాదించిన సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిండం… ఇలా పలు కారణాల వల్ల `మోగ్లీ`పై దృష్టి పడింది. ‘అఖండ 2’ వల్ల ఒక్క రోజు ఈ సినిమా ఆలస్యం కావడం… దర్శకుడు ఎమోషనల్ అవ్వడం, బండి సరోజ్ కాంట్రవర్సీ ట్వీట్ పెట్టడం వల్ల కూడా ఈ సినిమా గురించి ప్రేక్షకులకు ఇంకొంచెం తెలిసింది. మరి విడుదలకు ముందు ఇంతగా ఆకర్షించిన ఈ సినిమాలో విషయం ఉందా, లేదా??
పార్వతీపురం అనే ఓ అటవీ ప్రాంతంలో జరిగే కథ ఇది. అక్కడ మోగ్లీ అని పిలుచుకొనే మురళి (రోషన్ కనకాల) అందరికీ కావాల్సిన వాడు. వాస్తవానికి అనాథ. కానీ తనకంటూ ఓ బాబాయ్, స్నేహితుడు (వైవా హర్ష) తోడుగా ఉంటారు. ఊరివాళ్లందర్నీ వరస పెట్టి పిలుస్తుంటాడు. పోలీస్ కావాలన్నది తన ఆశయం. ఈలోగా చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. ఆ ఊర్లోకి ఓ బృందం షూటింగ్ కోసం వస్తుంది. ఆ ట్రూప్ లో డాన్సర్‌గా పని చేస్తున్న జాస్మిన్ (సాక్షి మదోల్కర్)ని తొలి చూపులోనే ఇష్టపడతాడు. జాస్మిన్ వినలేదు… మాట్లాడలేదు. అయితే అవేం మోగ్లీ ప్రేమని ఆపలేవు. జాస్మిన్ కూడా మోగ్లీని ప్రేమిస్తుంది. అయితే ప్రొడ్యూసర్ కన్ను జాస్మిన్ పై పడుతుంది. తనని ఎలాగైనా తన ముగ్గులోకి దింపాలని అనుకొంటాడు. అయితే మోగ్లీ ప్రేమకథని తెలుసుకొని, తనని అడ్డు తొలగించుకోవాలని చూస్తాడు. జాస్మిన్ పై మోగ్లీ కి లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తాడు. అవన్నీ మోగ్లీ నమ్మాడా? ఈ ప్రేమ కథలో క్లిస్టఫర్ (బండి సరోజ్) పాత్రేమిటి? కర్మ సిద్ధాంతానికీ, దేవుడికీ, ఈ కథలో పాత్రలకూ ఉన్న లింకేమిటి? అనే విషయాలు తెరపై చూడాలి.
ఈ కథలో చాలా అంశాల్ని పొందుపరచాలని చూశాడు దర్శకుడు. చూడ్డానికి ఇదో ప్రేమకథలానే కనిపిస్తుంది. కానీ ఇందులోనే యాక్షన్, ఫ్రెండ్ షిప్ ఎమోషన్, కర్మ, దేవుడు… ఇలా రకరకాల అంశాల్ని మేళవించే ప్రయత్నం చేశాడు. ఒక కథలో ఇన్ని జోనర్ షిఫ్ట్ లు ఉండకూడదని లేదు. కానీ ఆ మేళవింపు సరైన రీతిలో సాగాలి. ఈ సినిమాలో మాత్రం ప్రసాదానికి ప్రసాదం, తీర్థానికి తీర్థం అన్నట్టు దేనికదే విడివిడిగా కనిపిస్తాయి. బండి సరోజ్ పాత్రని పరిచయం చేసి కథలోకి వెళ్లిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. పోలీస్ పాత్రపై ఆసక్తి ఫస్ట్ సీన్లోనే కలుగుతుంది. ఆ తరవాత ట్విస్ట్ కోసమన్నట్టు ఆ పాత్రని దాచేసి ఇంట్రవెల్ వరకూ కనిపించకుండా చేశారు. ఓ పాత్రని ప్రేక్షకుడు ప్రేమించడం మొదలెట్టాక… వీలైనంత త్వరగా ఆ పాత్రని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి. అది ఇక్కడ జరగలేదు. పోనీ ఆ మధ్య నడిచిన ప్రేమకథైనా ఆసక్తికరంగా ఉందీ అంటే అదీ లేదు. హీరోయిన్ని డఫ్ అండ్ డమ్ గా ఎందుకు మార్చాడో అర్థం కాదు. ఆ పాత్రపై సింపతీ కోసమా, దాని వల్ల కథకు ఒనగూరిన అదనపు ప్రయోజనం ఏమైనా ఉందా? అనేవి బుర్రకు ఎక్కవు.
హీరో – హీరోయిన్ల మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా బలంగా ఇరికించినట్టే అనిపిస్తుంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ని దర్శకుడు వినోదం కోసం వాడుకొన్నాడు. అలాంటప్పుడు ఆ ట్రాక్ నుంచైనా ఫుల్ ఫన్ పుట్టించి ఉంటే బాగుండేది. సరిగ్గా ఇంట్రవెల్ కి ముందు విలన్ పాత్ర రీ ఎంట్రీ ఇస్తుంది. ఆ తరవాతైనా బండి ఫుల్ స్పీడులో సాగాల్సింది. కానీ అలా జరగలేదు. విలన్ హీరోయిన్ పై మోజు పడడం, తనని దక్కించుకోవాలని చూడడం… ఓల్డ్ స్కూల్ డ్రామా. తీత కూడా అలానే సాగింది. ఫ్రెండ్ షిప్కి సంబంధించిన సీన్లు బాగానే రాసుకొన్నా, ఎమోషన్ పరంగా సరిగా వర్కవుట్ కాలేదు. తేజ రూపొందించిన జయం సినిమా ప్రభావం కావాల్సినంత ఉంది. కానీ అప్పటికీ ఇప్పటికీ జనరేషన్ మారిపోయింది. కానీ దర్శకుడు మాత్రం ఇంకా తేజ జమానాలోనే ఉండి సీన్లు రాసుకొన్నాడనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లో తీసిన సీన్ చాలా సుదీర్ఘంగా సాగుతుంది. తాళ్లు, కొవ్వొత్తి, కత్తి, కుక్కర్…. ఇలా రకరకాల ప్రోపర్టీస్ చూపిస్తుంటాడు దర్శకుడు. తన తెలివితేటల్ని ఉపయోగించి…. ఏదో బ్రహ్మాండమైన సీన్ రాబడుతున్నాడన్న బిల్డప్ కనిపిస్తుంది. తీరా చూస్తే లాగ్ తప్ప ఇంకేం ఉండదు ఆ సీన్లో. ఇలాంటివి ఈ సినిమాలో చాలానే కనిపిస్తాయి. చివర్లో చెప్పిన కర్మ సిద్దాంతం ట్రాక్ కూడా అలానే ఉంటుంది. ఒక రొటీన్ కథని అడవిలో తీయడం వల్ల కాస్త ఫ్రెష్ నెస్ వచ్చిందేమో? అంతకు మించి ఆ బ్యాక్ గ్రౌండ్ వల్ల కూడా ఒరిగిందేం లేదు.
రోషన్ కనకాలకు ఇది రెండో సినిమా. తొలి సినిమాలోనే ఎనర్జిటిక్ గా కనిపించాడేమో అనిపిస్తుంది. లుక్, ఎక్స్ప్రెషన్స్ విషయంలో కాస్త మెరుగవ్వాలి. హీరోయిన్ మాంటేజ్ షాట్స్ లో అందంగా కనిపించింది. నటించాలని చూసినప్పుడు మాత్రం తేలిపోయింది. పైగా డఫ్ అండ్ డమ్. మాటలు కూడా లేవు. ఎక్స్ప్రెషన్స్ తోనే నటించాలనుకొనే పాత్ర రాసినప్పుడు ఈ ఎఫెక్ట్ సరిపోదు. వైవా హర్షకు మంచి మార్కులు పడతాయి. సుహాస్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. బండి సరోజ్ మంచి నటుడు. తన ఎంట్రీ సీన్ అదిరిపోయింది. అయితే తర్వాతర్వాత తాను కూడా రెగ్యులర్ విలన్ గా మారిపోయాడు.
అటవీ నేపథ్యంలో ఇంత సహజంగా సినిమాని తెరకెక్కించడం వెనుక కెమెరా మెన్ ప్రతిభ కనిపిస్తుంది. విజువల్స్ బాగున్నాయి. కాలభైరవ పాటలకు, నేపథ్య సంగీతానికీ పెద్ద స్కోప్ లేదు. నిడివి ఇంకాస్త తగ్గిస్తే బాగుండేది. దర్శకుడు ఏం రాసుకొన్నాడో కానీ, ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం తేలిపోయాడు. కథ, కథనం, వాటిని తీర్చిదిద్దిన విధానంలో క్లీషే కొట్టొచ్చినట్టు కనిపించింది. అటవీ నేపథ్యం, కర్మ సిద్దాంతం మిక్స్ చేయకపోతే ఈ కథ మరింత రొటీన్ గా తయారయ్యేది.
Telugu360 Rating: 1.75/5
