లిక్కర్ స్కామ్లో జగన్ రెడ్డి తరపున ప్రతినిధిగా వ్యవహరించిన నెలకు ఐదు కోట్ల చొప్పున కమిషన్లు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. అన్ని న్యాయపరమైన అవకాశాలు మూసుకుపోవడంతో తప్పనిసరిగా సిట్ ఎదుట హాజరయ్యారు. విచారణకు తన అనుచరుల్ని, చిత్తూరు జిల్లా నేతల్ని వెంట బెట్టుకుని వచ్చిన ఆయన బలప్రదర్శన చేసే ప్రయత్నం చేశారు. సిట్ ఆఫీసులో చాలా సేపు ఆయనను ప్రశ్నించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు అయిన మిథున్ రెడ్డి.. పీఎల్ఆర్ పేరుతో గ్రూపు కంపెనీలు నిర్వహిస్తూంటారు. ప్రతి నెలా లిక్కర్ స్కాం సొమ్ము.. ఈ సంస్థల ఖాతాల్లోకి ఐదు కోట్ల మేర జమ అయ్యేది. విచారణలో ఈ డబ్బులన్నీ ఎక్కడివని ప్రశ్నిస్తే సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. సిట్ అధికారులు ఆధారాలు చూపించి మరీ ప్రశ్నించినా సైలెంట్ గా ఉన్నారు. దాంతో..అరెస్టు చేస్తున్నట్లుగా నోటీసులు ఇచ్చారు. ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
అరెస్టు చేసిన ఇరవై నాలుగుగంటల లోపు కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. అందుకే కోర్టులో న్యాయమూర్తి ముందు శనివారం రాత్రికే హాజరు పరుస్తారా.. ఆదివారం హాజరు పరుస్తారా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే లిక్కర్ స్కాంలో పదకొండు మందిని అరెస్టు చేశారు. మిథున్ రెడ్డి పన్నెండో వ్యక్తి. చాలా మంది దుబాయ్ లో తలదాచుకుంటున్నారు. వారిని కూడా అరెస్టు చేయాల్సి ఉంది.