ప్రభాస్ అభిమానుల ఫోకస్ అంతా ప్రస్తుతానికి ‘రాసాజాబ్’పైనే ఉంది. సంక్రాంతి సీజన్ లో మొట్టమొదటిగా పలకరించబోతున్న సినిమా ఇది. ఈనెల 8 నుంచి ప్రీమియర్ల హడావుడి మొదలైపోతుంది. టీజర్, ట్రైలర్ ఎలా ఉన్నా, ట్రైలర్ 2ఓ మాత్రం అభి మానులకు కావల్సినంత కిక్ ఇచ్చింది. మరోవైపు మారుతి ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా హైప్ పెంచేస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో కీలకమైన పాట వస్తోంది. అదే ‘నాచే నాచే’.
‘డిస్కో డాన్సర్’ నుంచి ఓ పాటని ఈ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నారన్న విషయం తెలుగు360 ముందుగానే అభిమానులకు హింట్ ఇచ్చింది. ఇప్పుడు అదే నిజమైంది. ‘నాచే నాచే’ పాటను సోమవారం విడుదల చేస్తున్నారు. ఈ పాటలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ స్టెప్పులు వేయబోతున్నాడు. ఆ ఆల్బమ్ లో ఖరీదైన పాట ఇదే. ఎందుకంటే.. పాట హక్కుల కోసం దాదాపు రూ.2 కోట్లు వెచ్చించింది చిత్రబృందం. అంతేకాదు. ఈ పాట నుంచి వచ్చే రాబడిలో సగం.. ‘డిస్కో డాన్సర్’ హక్కు దారులకు ఇచ్చేయాలి. ఆ లెక్కల్లో ఈ పాటని రీమిక్స్ చేశారు. సెట్ కోసం కూడా బాగానే ఖర్చు పెట్టినట్టు సమాచారం. ‘రాజాసాబ్లో’నే కాదు, ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లోకెల్లా.. ఇదే ఖరీదైన పాటగా మిగిలిపోనుంది. ఇప్పటి వరకూ ‘రాజాసాబ్’ నుంచి వచ్చిన పాటలు ఫ్యాన్స్ కి పూర్తి సంతృప్తి ఇవ్వలేకపోయాయి. ఈపాటైనా.. అంచనాల్ని అందుకొంటుందేమో చూడాలి.


