ఏపీ విద్యాశాఖ గిన్నిస్ రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల జరిగిన పేరెంట్-టీచర్ మీటింగ్ కూడా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. 53.4 లక్షల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్న మెగా పీటీఎంగా గుర్తించారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు సహా మొత్తం 1.5 కోట్లు మంది పాల్గొన్న అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగులో భాగమైనట్లుగా గుర్తించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను తీసుకురావడానికి నారా లోకేష్ సంస్కరణలు చేపట్టారు. MEGA PTM నుండి సేకరించిన డేటాను నిశితంగా ఆడిట్ చేసిన తర్వాత ఈ రికార్డు అధికారికంగా గిన్నిస్ రికార్డు బృందం ధ్రువీకరించింది. ప్రతి పీటీఎంలోనూ మూడు ఫోటోగ్రాఫ్‌లు, ఒక వీడియో, తల్లిదండ్రులు , ఉపాధ్యాయుల సంఖ్య, పాల్గొన్న ప్రతి పాఠశాల నుండి ఇండిపెండెంట్ విట్నెస్ ద్వారా డేటాను LEAP యాప్ ద్వారా సేకరించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నియమించిన 40 మందికి పైగా ఆడిటర్లు ఈ అవార్డును నిర్ధారించడానికి 61000 పాఠశాలల నుండి సేకరించిన డేటాను విశ్లేషించారు.
అధికారిక గిన్నిస్ ప్రపంచ రికార్డు ధృవపత్రం ఆగస్టు రెండవ వారంలో అమరావతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందజేస్తారు. ఇంతకు ముందు యోగా దినోత్సవం రోజున కూడా గిరిజన విద్యార్థులు గిన్నిస్ రికార్డు సృష్టించారు.