తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా, ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను వెలికి తీసేందుకు ఏకసభ్య కమిటీని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం సిట్ విచారణకే పరిమితం కాకుండా, పాలనాపరమైన లోపాలు, టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలు , ఉన్నతాధికారుల పాత్రను ఈ కమిటీ క్షణ్ణంగా అధ్యయనం చేయనుంది. అయితే, ఈ కమిటీ నియామకం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కేసును ధిక్కరించడమేనంటూ వైసీపీ వాదిస్తోంది.
కమిటీ నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది!
సాధారణంగా ప్రభుత్వం నియమించే ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ కమిటీలు, ఎంక్వైరీ కమిషన్లు సివిల్ కోర్టుకు ఉండే కొన్ని అధికారాలను కలిగి ఉంటాయి. సాక్షులను పిలిపించడం, పత్రాలను పరిశీలించడం, క్షేత్రస్థాయిలో విచారణ చేసే వెసులుబాటు వీరికి ఉంటుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక తుది తీర్పు కాకపోయినప్పటికీ, అది ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవడానికి బలమైన పునాదిగా మారుతుంది. ముఖ్యంగా, పాలనాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఈ కమిటీ సిఫారసులు అత్యంత కీలకం.
కమిటీ సిఫారసుల ఆధారంగా కేసులు
కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత, అందులోని అంశాల ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా, భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా వ్యవస్థాగత మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని సంస్థలో జరిగిన పాలనాపరమైన లోపాలపై అంతర్గత విచారణ జరుపుకోవడం రాజ్యాంగబద్ధమేనని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అదనపు సమాచారం లభిస్తే దానిని కోర్టుకు సమర్పించవచ్చని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కమిటీకి రాజకీయ నేతలను, మాజీ బోర్డు సభ్యులను, అధికారులను విచారణకు పిలిపించే అధికారం ఉంటుంది . ఏకసభ్య కమిటీ విచారణలో భాగంగా ఎవరికైనా నోటీసులు జారీ చేసి, వారు తీసుకున్న నిర్ణయాలపై వివరణ కోరవచ్చు గతంలో టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి లే, భూమన కరుణాకర్ రెడ్డి వంటి వారిని, టెండర్ల ప్రక్రియలో వారి పాత్రపై ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అయితే ఈ కమిటీ ఎవరినీ జైలుకు పంపలేదు. తన విచారణ ముగిసిన తర్వాత ఫలానా వారు నేరానికి పాల్పడ్డారు, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని ప్రభుత్వానికి ఫారసు మాత్రమే చేయగలదు.
వైసీపీకి ఎందుకంత భయం?
సుప్రీంకోర్టు ఇప్పటికే సిట్‌ను పర్యవేక్షిస్తున్నప్పుడు మళ్లీ కమిటీ ఎందుకని వైసీపీ ప్రశ్నిస్తోంది. అయితే, సిట్ అనేది కేవలం నేర పరిశోధనకే పరిమితం కాగా, ఈ ఏకసభ్య కమిటీ మొత్తం వ్యవస్థలోని లొసుగులను సరిదిద్దే పాలనాపరమైన ప్రక్షాళన కోసం ఉద్దేశించినది. తప్పుడు ప్రచారాల ద్వారా ఈ పాపం నుంచి తప్పించుకోవాలని చూడటం సాధ్యం కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
