మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరుగుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లోని రెండు వర్గాలు తిరిగి ఏకం కావడం , అధికారికంగా ఎన్డీయే కూటమిలో భాగం అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం తర్వాత పవార్ కుటుంబం మొత్తం ఒక్కటి కావాలని నిర్ణయించుకోవడం, ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఎన్డీఏలోకి శరద్ పవార్
దివంగత అజిత్ పవార్ వారసురాలిగా ఆయన సతీమణి సునేత్రా పవార్ శనివారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ నిర్వహించిన కీలక బాధ్యతలను భర్తీ చేసేందుకు ఆమెను రంగంలోకి దించారు. కుటుంబం , పార్టీ శ్రేణుల మద్దతుతో ఆమె ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. గత కొంతకాలంగా చీలిపోయి ఉన్న శరద్ పవార్ , అజిత్ పవార్ వర్గాలు ఫిబ్రవరి మధ్యలో అధికారికంగా విలీనం కాబోతున్నాయి. ఈ విలీనం తర్వాత ఏకీకృత ఎన్సీపీ పూర్తిగా ఎన్డీయే కూటమిలోనే కొనసాగాలని నిర్ణయించుకోవడం ప్రతిపక్ష ఇండీ కూటమికి పెద్ద దెబ్బ. ఇప్పటి వరకు కాంగ్రెస్ పక్షాన నిలిచిన శరద్ పవార్, మారుతున్న పరిస్థితులు , కుటుంబ ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీయే వైపు మొగ్గు చూపడం వల్ల మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి.
సుప్రియా సూలేకు కేంద్ర మంత్రి పదవి?
విలీన ప్రక్రియలో భాగంగా జరిగిన ఒప్పందాల ప్రకారం, శరద్ పవార్ కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సూలే కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఆమెను కేంద్ర మంత్రిని చేయడం ద్వారా జాతీయ రాజకీయాల్లో పవార్ కుటుంబానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని ఎన్డీయే పెద్దలు భావిస్తున్నారు. సునేత్రా పవార్ రాష్ట్ర రాజకీయాలను, సుప్రియా సూలే కేంద్ర రాజకీయాలను చూసుకునేలా ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో మారిన రాజకీయ చిత్రం
ఈ విలీనం , కూటమి మార్పుతో మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి తిరుగులేని శక్తిగా అవతరించనుంది. పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటి కావడంతో కేడర్‌లో ఉత్సాహం పెరిగినప్పటికీ, సిద్ధాంతపరంగా శరద్ పవార్‌ను అనుసరించే శ్రేణులు ఈ ఎన్డీయే ‘ నిర్ణయాన్ని ఎలా స్వీకరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, ఫిబ్రవరిలో జరగబోయే అధికారిక విలీన ప్రకటన భారత రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. కాంగ్రెస్ పార్టీ కూటమి నుండి మరో పార్టీ చేజారిపోయినట్లు అవుతుంది.
