నెల్లూరులో ఐదుగురు సొంత పార్టీ కార్పొరేటర్లను ఇంటికి పలిపించుకుని మళ్లీ వారికి కండువాలు కప్పి..టీడీపీకి షాకిచ్చాం అని సంబరపడ్డ జగన్ తో పాటు ఇతర నేతలకు ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ కార్పొరేటర్లు ప్లేటు ఫిరాయించారు. దీంతో నెల్లూరు మేయర్ ప్రశాంతి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అవిశ్వాస తీర్మానం కూడా అవసరం లేదని మేయర్ నిర్ణయానికి వచ్చారు. దీంతో జగన్ దగ్గరకు తీసుకెళ్లి మరీ కండువాలు కప్పించిన అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఇజ్జత్ పోయినట్లయింది.
నెల్లూరులో టీడీపీకి ఒక్క కార్పొరేటర్ కూడాలేరు. ఎన్నికలు టీడీపీ బహిష్కరించింది. ఇండిపెండెంట్లు ఎవర్నీ పోటీ చేయనివ్వలేదు. అందుకే అప్పట్లో ఎలాంటి టీడీపీకి సీట్లు రాలేదు. కానీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ కార్పొరేటర్లు అంతా పార్టీ మారిపోయారు. ఇప్పుడు ఎవరికి మేయర్ సీటు వచ్చినా వారు కూడా వైసీపీ తరపున గెలిచిన వాళ్లకే వస్తుంది. కానీ వాళ్లు ఆ పార్టీలో ఉండటం లేదు.
నెల్లూరు సిటీ నుంచి ఇప్పుడు వైసీపీకి ఒక్క నిఖార్సు అయిన లీడర్ కూడా లేడు. అనిల్ కుమార్ యాదవ్ ఉన్నా యాక్టివ్ గా లేరు. ఆయనను వచ్చే ఎన్నికల నాటికి నెల్లూరులో ఉంచుతారో లేదో కూడా తెలియదు. కోటంరెడ్డి లాంటి వాళ్లు అంతా వెళ్లిపోవడం.. ఆనం కుటుంబంలో ఒకరిద్దరు యాక్టివ్ గా ఉన్నా వారికి అంత పలుకుబడి లేకపోవడంతో వైసీపీ బలహీనపడిపోయింది.
