సోషల్ మీడియా సంచలనాలు మెల్లమెల్లగా వెండి తెరపైపు అడుగులు వేస్తూ, ఇక్కడ కూడా తమ ఉనికిని చాటుకొంటున్నాయి. మొన్నటికి మొన్న `లిటిల్ హార్ట్స్` సినిమాతో మౌళి చెలరేగిపోయాడు. ఇప్పుడు తన చేతి నిండా సినిమాలే. యూత్ కథలతో, చిన్న నిర్మాతలు ఇప్పుడు మౌళి వెంట పడుతున్నారు. ఇప్పుడు నిహారిక వంతు వచ్చింది. మౌళిలా… నిహారిక కూడా ఓ స్టారే. కాలేజీ చదివే రోజుల్లోనే యూ ట్యూబ్ ఛానల్ పెట్టి పాపులారిటీ సంపాదించుకొంది. పెద్ద పెద్ద హీరోలు సైతం నిహారికతో తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకొనే వారు. ‘మేజర్’ సినిమా కోసం మహేష్ బాబుతో కలిసి చేసిన ఓ ప్రోమో స్కిట్ భలే పాపులర్ అయ్యింది. అప్పటి నుంచీ నిహారిక మరింత ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు తొలిసారి ఓ సినిమాలో నటించింది. అదే.. ‘మిత్రమండలి’. ఈ దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నటిగా తనకు ఇదే తొలి సినిమా కాదు. ఇది వరకు ఓ తమిళ సినిమా చేసింది. అందులో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు నాట మాత్రం నటిగా ఇదే తొలి ప్రయత్నం.
నిహారిక లాంటి అమ్మాయిలు సక్సెస్ కావాల్సిన అవసరం చాలా వుంది. ఓ హిట్టు పడితే తన మైలేజీ పెరగడం మాత్రమే కాదు, తనని చూసి చాలామంది అమ్మాయిలు ధైర్యంగా చిత్రసీమవైపు అడుగులు వేస్తారు. తెలుగమ్మాయిలు సినిమాల్లో కనిపించడం లేదన్న బెంగ కూడా తీరిపోతుంది. ”కెమెరా నాకేం కొత్తగా అనిపించలేదు. కాకపోతే యూ ట్యూబ్ లో `యాక్షన్, కట్` నేనే చెప్పుకొనేదాన్ని. నా స్క్రిప్టు నేనే రాసుకొనేదాన్ని. సినిమాల్లో అలా కాదు. ఆ పనులు చేయడానికి వేరే వాళ్లు ఉంటారు. దాంతో నా శ్రమ తగ్గింది” అని చెప్పుకొచ్చింది నిహారిక. టిపికల్ కథానాయిక పాత్రలకు నిహారిక సెట్ కాకపోవొచ్చు కానీ, వెరైటీ కథలకు తాను మంచి ఆప్షన్ అనిపిస్తుంది. తెలుగులో తనకు ఎలాంటి అవకాశాలు వస్తాయన్న విషయం ‘మిత్రమండలి’తో తెలిసిపోతుంది.