ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు సందర్భంగా గ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. మావయ్య అని సంబోధిస్తూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి గర్వకారణమని, ఆయన దార్శనికత భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని తారక్ ప్రశంసించారు. గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నప్పటికీ, ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆయన చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ తన అనుబంధాన్ని చాటుకుంటున్నారు.
ఎన్టీఆర్ తన మావయ్య చంద్రబాబు నాయుడు పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అధికారం లేనప్పుడుకూడా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ విష్ చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు , కూటమి భారీ విజయం సాధించినప్పుడు ఎన్టీఆర్ అత్యంత ఉత్సాహంగా అభినందనలు తెలిపారు. తాజాగా చేసిన ట్వీట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించే తీరు ప్రతిసారీ ఒక చర్చకు దారితీస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఆయన ఎప్పుడు వస్తారనే ఉత్కంఠ పార్టీ కేడర్లో ఉన్నప్పటికీ, తారక్ మాత్రం కుటుంబ సంబంధాలకు రాజకీయాలను ముడిపెట్టకుండా తన గౌరవాన్ని చాటుకుంటున్నారు. టీడీపీ పెద్దలతో ఆయనకు విబేధాలున్నాయని చెప్పి.. వైసీపీ నట్లు తరచూ ఎన్టీఆర్ ఫోటోను తమ ర్యాలీల్లో వాడుకుంటూ రాజకీయం చేస్తూంటారు. వాటన్నింటికీ ఎన్టీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా పటాపంచలు చేస్తున్నారు.


