కడప రాజకీయాల్లో నేరాలు, దౌర్జన్యాలే అర్హతగా ఎదిగే సంస్కృతి మరోసారి కోరలు చాచింది. వైసీపీ నేతల మాఫియా వ్యవహారాల మధ్య తేడాలు రావడంతో హత్యలు జరుగుతున్నాయి. మాఫియా పనుల ద్వారా కొట్టేసిన అక్రమ ఆస్తుల పంపిణీలో వచ్చిన తేడాలు చివరకు ప్రాణాలను బలిగొనే స్థాయికి చేరాయి. కడప రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన పెద్ద దస్తగిరి హత్యోదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఒకప్పుడు రైట్ హ్యాండ్ గా ఉన్న వ్యక్తినే, ఆస్తుల కోసం సొంత నాయకుడే అంతమొందించడం వైసీపీలోని నేర ప్రవృత్తికి అద్దం పడుతోంది. ఐదేళ్ల అధికారంలో అడ్డూఅదుపు లేకుండా సాగిన ఆస్తుల సేకరణ, నేడు ఆ పార్టీ నేతల మధ్యే నెత్తుటి ఏరులు పారిస్తోంది.
ఆస్తుల బదలాయింపు వివాదమే పెద్ద దస్తగిరి హత్యకు కారణం
ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారిగా మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని పోలీసులు గుర్తించారు. నిత్యానందరెడ్డి కిడ్నాపులు, బెదిరింపులు, కాంట్రాక్ట్ హత్యల మాఫియాను నడుపుతూ వందల కోట్ల ఆస్తులను కూడగట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన అక్రమ ఆస్తులను రక్షించుకోవడానికి పెద్ద దస్తగిరి పేరు మీద దాదాపు వంద కోట్ల విలువైన భూములు, డాక్యుమెంట్లను ఉంచినట్లు సమాచారం. అయితే, ఇటీవల ఈ ఆస్తుల బదలాయింపు విషయంలో ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలు చివరకు హత్యకు దారితీశాయి. పోలీసులు నిందితులను పట్టుకోవడంతో, పెద్ద దస్తగిరి ఇంట్లో బయటపడిన వందల కొద్దీ ఆస్తి డాక్యుమెంట్లు వైకాపా నేతల అక్రమ సంపాదనకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 300 నుండి 400 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.
జగన్ శవ రాజకీయాలు
సొంత పార్టీ నాయకుడే తన అనుచరుడిని చంపించినట్లు సాక్ష్యాధారాలతో బయటపడినా, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ ఘటనను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. మృతుడు పెద్ద దస్తగిరి ఇంటికి వెళ్లి పరామర్శించడం ద్వారా దీనిని రాజకీయ హత్య గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. నిందితుడు నిత్యానందరెడ్డిని టీడీపీ నేతగా ముద్ర వేసి బురదజల్లే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతున్నప్పటికీ, కడప వాసులకు వీరిద్దరి మధ్య ఉన్న బంధం, వైసీపీ లో వారు సాగించిన మాఫియా సామ్రాజ్యం గురించి స్పష్టమైన అవగాహన ఉంది. నిందితుడు పరారీలో ఉండటం, పార్టీ ముఖ్య నేతలు ఇందులో భాగస్వాములు కావడం ఆ పార్టీ ఇమేజ్ కు తగ్గట్లుగానే ఉంది.
నేర సామ్రాజ్యానికి సొంత దెబ్బ
ఐదేళ్లలో కడప కేంద్రంగా సాగిన నేర రాజకీయాలు ఇప్పుడు ఆ పార్టీ నేతలకే శాపంగా మారాయి. అధికారం అండతో పేదల భూములను కబ్జా చేసి, ఆస్తులు కూడబెట్టిన వారు ఇప్పుడు ఆ వాటాల కోసం ఒకరినొకరు చంపుకునే స్థాయికి చేరారు. పెద్ద దస్తగిరి హత్య కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది వైసీపీ లో పాతుకుపోయిన క్రైమ్ కల్చర్ కు నిదర్శనం. ఈ హత్య వెనుక పెద్ద తలకాయల పేర్లు కూడా ఉన్నాయని.. త్వరలో అవి బయటకు వస్తాయని అంటున్నారు.


