తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం హాట్ టాపిక్ అవుతోంది. ప్రాజెక్టు అక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహానికి పదును పెడుతున్నారు. ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని, తద్వారా అటు బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, ఇటు కేంద్రంలోని బీజేపీ వైఖరిని కూడా పరీక్షించాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అడుగులు ఇప్పుడు ఢిల్లీ వైపు, ముఖ్యంగా సీబీఐ డైరెక్టర్ వైపు పడుతున్నాయి.
కాళేశ్వరంపై చర్యల బాధ్యత బీజేపీకి
కాలేశ్వరం అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. హైకోర్టు ఆ రిపోర్టు ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అయితే, రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత తెలివిగా ఈ న్యాయపరమైన అడ్డంకిని అధిగమించే ప్రయత్నం చేస్తోంది. సీబీఐ విచారణ కోరుతూ పంపిన సిఫారసులో ఘోష్ కమిషన్ రిపోర్టును ప్రస్తావించకుండా.. అంతకుముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలను, ప్రాజెక్టులో జరిగిన నిధుల మళ్లింపు ఆరోపణలను ప్రాతిపదికగా తీసుకున్నారు. అంటే కోర్టు ఆదేశాలకు.. సీబీఐ విచారణకు అసలు ల ింక్లేవ్.
తాము చర్యలు తీసుకుంటే రాజకీయంగా నష్టమని రేవంత్ వ్యూహం
రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బీఆర్ఎస్ అగ్రనేతలపై చర్యలు తీసుకుంటే, అది రాజకీయ కక్ష సాధింపు గా ముద్రపడే ప్రమాదం ఉందని రేవంత్ భావిస్తున్నారు. దీనివల్ల బీఆర్ఎస్కు ప్రజల్లో సానుభూతి పెరిగే అవకాశం ఉంది. అందుకే, ఈ బంతిని కేంద్రం వైపు విసిరారు. వేల కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది, మీరు విచారణ జరిపించండి అని కోరడం ద్వారా, అటు బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టారు. ఒకవేళ కేంద్రం సీబీఐ విచారణ చేయించకపోతే బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే, మోదీ కేసీఆర్‌ను కాపాడుతున్నారు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ యోచిస్తున్నారు.
బీజేపీ నేతలకు ఇబ్బందికర పరిణామమేనా
రాష్ట్ర బీజేపీ నేతలకు ఈ సీబీఐ విచారణ అంశం సంకటంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తుందన్న భయం, మరోవైపు విచారణకు అంగీకరించకపోతే బీఆర్ఎస్ మిత్రపక్షమని ముద్ర పడుతుందన్న ఆందోళన వారిలో ఉంది. సీబీఐ రంగంలోకి దిగితే కేసీఆర్ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తుందని, అప్పుడు బీఆర్ఎస్ కేడర్ తమ వైపు వస్తుందని కొందరు బీజేపీ నేతలు ఆశిస్తున్నప్పటికీ, అమిత్ షా వంటి అగ్రనేతలు ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడం రేవంత్‌ను మరింత దూకుడుగా వ్యవహరించేలా చేస్తోంది.
రేవంత్ ప్లాన్లు వర్కవుట్ అవుతాయా?
రేవంత్ రెడ్డి సీబీఐ డైరెక్టర్‌ను స్వయంగా కలవడం లేదా.. మంత్రుల బృందాన్ని పంపి విజ్ఞప్తి చేయించడం వంటి ఆలోచనలు చేస్తున్నారు. రాష్ట్రం సేకరించిన ప్రాథమిక ఆధారాలను అందజేయాలని చూస్తున్నారు. కేవలం లేఖలకే పరిమితం కాకుండా, వ్యక్తిగతంగా ఒత్తిడి తేవడం ద్వారా కేంద్రంపై నైతిక విజయం సాధించాలనేది ఆయన లక్ష్యం. అయితే, సీబీఐ విచారణకు కేంద్రం పచ్చజెండా ఊపుతుందా లేదా అన్నది ఇప్పుడు ఢిల్లీలోని పెద్దల నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఏది చేసినా రేంత్‌కు లాభమే అనుకోవచ్చు.
