అరవింద్ కేజ్రీవాల్ పూర్తిగా దారి తప్పారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచాల్సిన బాధ్యత గల ఒక కీలక రాజకీయ నాయకుడు, ఏకంగా హైకోర్టు న్యాయమూర్తిపైనే అపనమ్మకాన్ని ప్రకటిస్తూ విచారణను బహిష్కరించడ ఆయనను చిక్కుల్లోకి నెడుతోంది.
కోర్టులో అడుగు పెట్టను.. లాయర్‌ను పంపను!
రాజకీయాల్లో గెలుపోటములు, కోర్టుల్లో తీర్పులు సహజం. కానీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం కొత్త పంథా ఎంచుకున్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మపై తనకు నమ్మకం పోయిందని, ఇకపై ఆమె ఎదుట జరిగే విచారణకు తాను హాజరుకాబోనని, కనీసం తన తరపున లాయర్‌ను కూడా పంపనని సంచలన ప్రకటన చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి, న్యాయమూర్తిని మార్చాలని కోరడం, అది సాధ్యం కాకపోతే ఏకంగా వ్యవస్థనే ధిక్కరిస్తానని అనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అనుకూల తీర్పు వస్తేనే నమ్ముతారా?
కేజ్రీవాల్ వాదన ప్రకారం.. సదరు న్యాయమూర్తి పిల్లలు ప్రభుత్వ ప్యానెల్ లాయర్లుగా ఉండటం వల్ల తనకు న్యాయం జరగదని ఆయన అనుమానిస్తున్నారు. అయితే, ఒక రాజకీయ నాయకుడిగా వ్యవస్థలను గౌరవించాల్సింది పోయి, తనకు అనుకూలమైన తీర్పులు వస్తే న్యాయం గెలిచింది అని, వ్యతిరేక సూచనలు కనిపిస్తే న్యాయమూర్తిపై నమ్మకం లేదు అని అనడం వ్యవస్థను బలహీనపరచడమే అవుతుంది. గాంధీజీ చెప్పిన సత్యాగ్రహం మార్గాన్ని తాను అనుసరిస్తున్నానని ఆయన చెబుతున్నా, ఇది నిజంగా ప్రజాస్వామ్య విలువలని కాపాడే ప్రయత్నమా లేక చట్టం నుండి తప్పించుకునే వ్యూహమా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రమాదకర సంప్రదాయం
న్యాయస్థానాల మీద నమ్మకం లేదని చెప్పడం ద్వారా కేజ్రీవాల్ ఒక ప్రమాదకరమైన సంప్రదాయానికి తెరలేపుతున్నారు. రేపు ప్రతి రాజకీయ నాయకుడు తనకు నచ్చని న్యాయమూర్తి బెంచ్ నుండి తప్పుకోవాలని పట్టుబడితే, అసలు న్యాయ విచారణ అన్నదే అసాధ్యం అవుతుంది. వ్యవస్థలను ఇలా బ్లాక్ మెయిల్ చేయడం వల్ల మొదటగా నష్టపోయేది రాజకీయ నాయకులే. ఎందుకంటే, రేపు వారికే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మొరపెట్టుకోవడానికి బలమైన వ్యవస్థ మిగలదు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థ ప్రతిష్టను పణంగా పెట్టడం సరికాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయం చట్టపరంగా ఆయనకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. నిందితుడు లేదా సాక్షి కోర్టుకు రానప్పుడు, కోర్టు తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. నిజం నిరూపించుకోవడానికి కోర్టుకు వెళ్లాలి కానీ, కోర్టునే బహిష్కరిస్తాను అనడం రాజకీయంగా సంచలనం కావొచ్చు కానీ, న్యాయపరంగా అది ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది. కేజ్రీవాల్ అదే చేసుకుంటున్నారు.
