జగన్ రెడ్డి తనపై జరిగిన కోడికత్తి కేసులో ఇంకా లోతైన దర్యాప్తు కావాలని కోర్టుకెళ్లారు. ఎంత లోతు అనేది జగన్ రెడ్డికే క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు దర్యాప్తు పూర్తి చేసింది NIA. ఆయన కోరిక మేరకు జరిగిన దర్యాప్తు. అయినా ఆయన ఈ కేసులో ఇంకేదో కావాలని కోరుకుంటున్నారు.
ఎన్ఐఏ విచారణ వేయించుకుంది జగనే !
విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం కాక ముందు జగన్ పై ఓ యువకుడు చిన్న కోడికత్తితో.. అంత కంటే చిన్న గాయం చేశారు. తనపై జరిగిన దాడిని ప్రపంచ స్థాయి కుట్రగా భావించి, స్వయంగా జగన్ రెడ్డి పట్టుబట్టి మరీ కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగేలా చేశారు. అప్పటి కేంద్ర పెద్దలతో ఉన్న సంబంధాలతో ఆయన అలా చేసుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు కూడా దేశ భద్రతకు ఏమైనా ముప్పు ఉందేమో అన్నంత రేంజ్లో ఏళ్ల తరబడి ఊపిరి సలపకుండా దర్యాప్తు చేసి, ఇందులో అంత సీన్ లేదు బాబోయ్ అని చార్జిషీటు దాఖలు చేశారు.
జగన్ స్క్రిప్ట్ ప్రకారం లేని చార్జిషీటు
జగన్ రెడ్డి గారి లాజిక్ ప్రకారం.. దర్యాప్తు అంటే ఆయన రాసిచ్చిన స్క్రిప్టు ప్రకారం జరగాలి. NIA వారు వాస్తవాలు చెబితే అది లోతైన దర్యాప్తు ఎలా అవుతుంది? అందుకే, దిగువ కోర్టు నుంచి హైకోర్టు దాకా అప్పీళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. నాకు నచ్చిన విషయాన్ని నిజం పేరుతో మీరు చెప్పేదాకా దర్యాప్తు చేస్తూనే ఉండాలి అన్నట్లుగా ఉంది ఆయన తీరు. బాధితుడిగా సాక్ష్యం చెప్పడానికి కోర్టు గడప తొక్కడానికి మాత్రం సమయం దొరకదు కానీ, దర్యాప్తు సంస్థల తీరు మీద మాత్రం అంతులేని అసంతృప్తి!
జగన్ అభిమాని జీవితం దుర్భరం
ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు పరిస్థితి ఘోరం. జగన్ అంటే ప్రాణం ఇచ్చేంత అభిమానంతో ఏదో గిమ్మిక్కు చేయబోయి, ఇప్పుడు అదే అభిమాన నేత పుణ్యమా అని ఏళ్ల తరబడి జైలు గోడల మధ్య నలిగిపోయాడు. ఒక సామాన్యుడి జీవితం బుగ్గిపాలవుతున్నా పట్టించుకోకుండా, ఈ కోడి కత్తిని రాజకీయంగా ఎలా వాడుకోవాలా అనే తాపత్రయమే తప్ప, కేసును ఒక కొలిక్కి తెద్దామన్న ఆలోచన బాధితుడైన జగన్‌లో కనిపించలేదు. NIA తేల్చింది ఒకటి.. జగన్ కోరుకుంటున్నది మరొకటి. రాజకీయ లబ్ధి కోసం ఒక చిన్న సంఘటనను జగన్ ఎన్ని ఏళ్లు సాగదీస్తారనేదానికి ఈ కోడి కత్తి ఎపిసోడ్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్!
