ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో డీజీపీగా పని చేసిన ఆయన… తన పనులన్నీ సజ్జల చేస్తూంటే నిస్సహాయంగా ఉండిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత లేని పోస్టుకు పరిమితమయ్యారు. అప్పట్లో నిమిత్తమాత్రంగా ఉండటమే ఆయనకు గౌరవ రిటైర్మెంట్ దక్కడానికి కారణం అవుతోంది.
నిశ్శబ్దంగా లూప్ లైన్ ముగింపు!
పదిహేను మంది సీనియర్లు ఉన్నా వారిని కాదని జగన్ రెడ్డి ఏపీ పోలీస్ బాస్ గా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించుకున్నారు. ఆయన ప్రాంతం, సామాజికవర్గం అన్నీ కలసి వస్తాయని అలా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆయనకు పవర్ ఏమీ ఇవ్వలేదు. సజ్జలనే ఆయన పేరుతో అన్నీ చేశారు. ఫలితంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. సహజంగానే ప్రభుత్వం మారిన తర్వాత ఆయన సైడ్ అయిపోయారు. ఇప్పుడు
కెరీర్ ఇప్పుడు నిశ్శబ్దంగా ముగియనుంది. ఈ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేస్తున్నారు.
పోస్టింగ్ ఉంది.. అదే ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవం
ప్రస్తుతం ఆయన కమిషనర్ ఆఫ్ ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ వంటి ప్రాధాన్యత లేని పోస్టులో ఉంటూ తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్నారు.
గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం జోక్యంతో డీజీపీ పదవి నుంచి తప్పుకున్న రాజేంద్రనాథ్ రెడ్డి, ఆ తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే పూర్తిస్థాయిలో లూప్ లైన్లోకి వెళ్లారు. సాధారణంగా గత ప్రభుత్వంలో అత్యంత సన్నిహితంగా పని చేసిన అధికారులపై కొత్త ప్రభుత్వం విచారణలు, వేటు వంటి చర్యలు చేపడుతుంటుంది. కానీ, రాజేంద్రనాథ్ రెడ్డి విషయంలో మాత్రం ప్రభుత్వం ఒక రకమైన మౌన వ్యూహాన్ని అవలంబించినట్లు కనిపిస్తోంది. ఆయనపై పెద్దగా కేసులు కానీ, తీవ్రస్థాయి విచారణలు కానీ జరగడం లేదు.
ఏమీ పట్టించుకోకపోవడమే మేలు చేసింది!
కొంత మంది ఐపీఎస్ అధికారులు తీవ్రమైన ఆరోపణలు, సస్పెన్షన్లతో సతమతమవుతుంటే, వారందరికీ బాస్‌గా వ్యవహరించిన రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం ఎక్కడా వివాదాలకు తావు లేకుండా జాగ్రత్త పడ్డారు. ప్రభుత్వం కూడా ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా, కేవలం లూప్ లైన్ పోస్టుకు పరిమితం చేయడం ద్వారా గౌరవప్రదమైన నిష్క్రమణ కు అవకాశం ఇచ్చారు. ఆయన రిటైర్మెంట్ సందర్భంగా ఎలాంటి హడావుడి లేకుండా, ఒక సాధారణ వీడ్కోలుతోనే ఈ సీనియర్ ఐపీఎస్ ప్రస్థానం ముగియనుంది.
