“సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు. ఆ దేవుళ్ల సేవలో తరించడమే మానవ జన్మకు సార్థకత ” అని ప్రకటించి ఆచరించారు యుగపురుషుడు ఎన్టీఆర్. పేదవాడి కన్నీరు తుడవని చదువు వ్యర్థం, ఆకలి తీర్చని రాజకీయం అనర్థం. ఆకలి లేని సమాజమే అసలైన రామరాజ్యం అని నమ్మి దానికి తగ్గట్లుగా పాలన చేసి పేదల జీవితాలను మార్చేశారు. నేడు ఆయన వర్థంతి.
లుగు జాతి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసి, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు యుగపురుషుడు నందమూరి తారక రామారావు. వెండితెరపై రాముడిగా, కృష్ణుడిగా పౌరాణిక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ గా పేరుగాంచిన ఎన్టీఆర్, కేవలం నటుడిగానే కాకుండా ఒక సామాజిక విప్లవకారుడిగా కోట్లాది మంది ఆరాధ్యదైవమయ్యారు. ఆయన నటన తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమైతే, ఆయన పోషించిన పాత్రలు తెలుగు సంస్కృతికి నిలువుటద్దాలు.
నటన నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని హస్తగతం చేసుకుని, ఢిల్లీ పీఠాన్ని కదిలించిన అపర చాణక్యుడు ఎన్టీఆర్. తెలుగు వారి ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగు గడ్డపై సగర్వంగా తెలుగు జెండాను ఎగురవేసిన ధీశాలి. పేదవాడి ఆకలి తీర్చడానికి రెండు రూపాయలకే కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్లు, ఆస్తిలో మహిళలకు సమాన వాటా వంటి విప్లవాత్మక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేశారు. సంక్షేమ రాజ్య స్థాపన కోసం ఆయన చేసిన కృషి నేటికీ అనేక పథకాలకు దిక్సూచిగా నిలుస్తోంది.
వ్యక్తులు వెళ్ళిపోయినా, వారు వదిలిన ఆశయాలు అమరంగా మిగిలిపోతాయి. ఎన్టీఆర్ అనే మూడక్షరాలు కేవలం ఒక పేరు కాదు, అది తెలుగు వారి అస్తిత్వానికి ప్రతీక. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలకు మారుపేరుగా నిలిచిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, తెలుగు వారు ఉన్నంత కాలం ఆయన కీర్తి అజరామరం. నేడు ఆయన వర్ధంతి వేళ, ఆ మహనీయుని స్మరించుకుంటూ, ఆయన ఆశయ సాధనలో సాగడమే మనం ఇచ్చే నిజమైన నివాళి.
