రాజకీయ సందర్భం ఏదైనా జగిత్యాల కాంగ్రెస్ లో మాత్రం రచ్చ రచ్చ ఖాయంగా మారుతోంది. ఎంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగాల్సింది జరిగి తీరుతుంది. మున్సిపల్ టిక్కెట్ల పంపిణీలోనూ అదే జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచే మొదలైన ఆధిపత్య పోరు, మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపుతో పతాక స్థాయికి చేరింది. జగిత్యాల అంటే తన అడ్డా ‘ అని భావించే మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఎమ్మెల్యే సంజయ్ పెత్తనాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. మున్సిపాలిటీలోని 50 వార్డుల్లో మెజారిటీ స్థానాలు తన అనుచరులకే దక్కాలని ఆయన పట్టుబట్టినప్పటికీ, రాష్ట్ర నాయకత్వం సంజయ్ వర్గానికి 30, జీవన్ రెడ్డి వర్గానికి 20 చొప్పున టికెట్లు కేటాయించారు. ఇది జీవన్ రెడ్డికి నచ్చలేదు.
తన వర్గానికి కేవలం 20 సీట్లే ఇవ్వడంపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవన్ రెడ్డి అనుచరులు ఎమ్మెల్యే సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని నిరసనలకు దిగడం, సోషల్ మీడియాలో ఘాటు విమర్శలతో విరుచుకుపడటం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలోని ఈ అంతర్గత కుమ్ములాటలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. గతంలో మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఆవిశ్వాసం, రాజకీయ సమీకరణాల్లో మార్పుల వల్ల జగిత్యాల పట్టణంలో బీజేపీ ఇప్పటికే బలోపేతమైంది.
ఇప్పుడు అధికార పార్టీలో నెలకొన్న ఈ చీలికను ఆసరాగా చేసుకుని, అసంతృప్త నేతలను ఆకర్షించడం ద్వారా మెజారిటీ వార్డులను కైవసం చేసుకోవాలని కమలం పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కౌన్సిలర్లను గెలుచుకున్నా, చైర్మన్ ఎన్నిక నాటికి ఈ వర్గ పోరు ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని కేడర్ ఆందోళన చెందుతోంది. ఎమ్మెల్యే వర్గం చైర్మన్ పీఠం కోసం ప్రయత్నిస్తే, జీవన్ రెడ్డి వర్గం దాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్‌కు జగిత్యాల సెగ కొనసాగనుంది.
