జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయాల్లో చూపిస్తున్న వేగం బుల్లెట్ ట్రైన్ ను తలపిస్తోంది. హామీలు ఇవ్వడం రాజకీయ నేతలు చేస్తూంటారు. కానీ ఆ హమీలు అమల్లోకి రావాలంటే చాలా ఆలస్యం అవుతుంది. కొన్ని మర్చిపోతూంటారు కూడా.కానీ పవన్ కల్యాణ్ మాత్రం తన మంత్రిత్వ శాఖ కింద అప్పటికప్పుడు ఇవ్వాల్సిన .. జరగాల్సిన పనులు ఉంటే.. వెంటనే చేసేస్తున్నారు. అన్ని ప్రక్రియలూ నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నారు. అది రోడ్లు అయినా.. వ్యక్తిగత సాయం అయినా సరే. బుల్లెట్ ట్రైన్ వేగంతో జరిగిపోతున్నాయి.
నిమిషాల్లో రోడ్డు మంజూరు
మంగళగిరిలోని కానిస్టేబుల్ నియామకపత్రాల కార్యక్రమంలో జరిగిన ఘటన పవన్ కల్యాణ్ వేగానికి సాక్ష్యంగా నిలిచింది. ఓ కానిస్టేబుల్ విజేత వేదికపై రోడ్డు కోసం విన్నవించారు. సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేశారు పవన్ కల్యాణ్. అల్లూరి జిల్లా నుంచి కానిస్టేబుల్‌గా ఎంపికైన బాబురావు విజ్ఞప్తితో రోడ్డు మంజూరు చేశారు. గత వారం అంధ మహిళా క్రికెటర్ కూడా తన గ్రామానికి ఇలా రోడ్డు సౌకర్యం కావాలని అడిగారు. వెంటనే మంజూరు చేశారు. ఇవన్నీ మీడియా దృష్టికి వచ్చినవే. కానీ పబ్లిసిటీ వరకూ రాని నిర్ణయాలు ఇంకా చాలా ఉన్నాయి.
సాధారణంగా ప్రభుత్వ ప్రాసెస్ ఓ పెద్ద పజిల్
ఓ అభివృద్ధి పని మంజూరు కావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అనేక మంది అధికారులు పరిశీలనలు, ప్రతిపాదనలు పెట్టి ఆమోదించుకోవాలి. ప్రభుత్వంలో ఉండే ప్రాసెస్ అది. ఇటీవల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో చంద్రబాబు ఇలాంటి ప్రాసెస్ పై అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్నే మార్చుకుంటున్నప్పుడు కొన్ని పనికి మాలిన,అడ్డగోలు నిబంధనలను ఎందుకు మార్చుకోకూడదని ప్రశ్నించారు. ఇప్పుడు అలాంటి రూల్స్ అన్నింటినీ అధిగమిస్తూ.. పవన్ కల్యాణ్ మంత్రిత్వ శాఖ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా అనేక మందికి మేలు జరుగుతోంది.
వ్యక్తిగత సాయాలనూ అంతే వేగంగా చేస్తున్న పవన్
వ్యక్తిగతంగా ఎవరికైనా సాయంచేయాలనకున్నా పవన్ కల్యాణ్ ఏమాత్రం ఆలస్యం చేయడంలేదు. తాను ప్రకటించిన వెంటనే .. వారికి అందాల్సిన సాయానికి కార్యాచరణ ఖరారు అవుతుంది. ఆర్థికసాయం అయితే గంటల్లోనే చేరిపోతోంది. ఇతర సాయం అయితే నాలుగైదు రోజుల్లో అందుతోంది. అంధ క్రికెటర్లకు గృహోపకరణాలు కానీ.. చిలుకలూరిపేట స్కూల్ కు లైబ్రరీ, కంప్యూటర్లు కానీ హామీ ఇచ్చిన రోజుల్లోనే జరిగిపోయాయి.
జీవోలు వీలైనంత త్వరగా రోడ్లుగా మారిస్తే మరింత ప్రయోజనం
జీవో వచ్చింది. రేపటి నుంచి పనులు ప్రారంభించలేకపోవచ్చు. కాంట్రాక్టర్ ను ఎంపిక చేయాలి.పనులు ప్రారంభించాలి. దీని కోసం కొంత సమయం పట్టొచ్చు. ఎంత సమయం పట్టినా.. ఆలస్యం కాకుండా..పనులు పూర్తి కావాలి. ఎప్పుడూ ఆగిపోకూడదు. నిధులు లేదా అధికారుల నిర్లక్ష్యం అసలు కారణం కాకూడదు. అప్పుడు మాత్రమే.. ఈ జీవోలకు విలువ ఉంటుంది.


