మహాత్మాగాంధీ చూపించిన అహింసా సిద్దాంతం వల్లనే మనకు ఈ గతి పట్టిందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ పై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా గాంధీ సిద్ధాంతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మనం అహింసా మార్గంలో నడుస్తూ.. శాంతి మంత్రం పఠిస్తూంటే మరో వైపు కశ్మీర్లో కాశ్మీర్ పండిట్లను చంపడం ప్రారంభించారని అన్నారు. అంత్యక్రియలు తీసుకెళ్తే అక్కడ కూడా మారణహోమం సృష్టించారని అన్నారు.
దేశ విభజన విషయంలో దేశంలో కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. గాంధీ, నెహ్రూల వల్లనే పాకిస్తాన్ ఏర్పడిందని వారి భావన. సోషల్ మీడియాలో విమర్శలు కూడా చేస్తూంటారు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలన్న గాంధీ మహాత్మడి అహింసా సిద్ధాంతానికీ వ్యతిరేకులు ఉన్నారు. పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు ఈ వ్యతిరేకుల్లో చేరిపోయారని అనుకోవచ్చు.
దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఊరుకునేది లేదని పవన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లం అంటూ దేశ భద్రతకు, జాతీయ సమగ్రతకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాలో కుక్కల్లా ఏది పడితే అది మొరగకూడదని హెచ్చరించారు. ఆర్మీకి, ఉగ్రవాదులపై పోరాటానికి చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై పిచ్చి కూతలు కూసినా, ఏది పడితే అది మొరిగినా చర్యలు ఉంటాయని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.