బహుశా ‘సిగ్గు’ అనే పదం చుట్టూ ఓ సినిమా ఆడియో వేడుక జరుగుతుందని ఎవరూ వూహించి వుండరు! పైగా, ఇద్దరు సమకాలీన స్టార్ హీరోలు ఒకర్ని మరొకరు పొగుడుకుంటారని అనుకుంటారు. అందుకు, విభిన్నంగా గురువారం రాత్రి ‘నెల టికెట్టు’ ఆడియో జరిగింది. అందులో సినిమా హీరో రవితేజ స్పీచ్, ఆడియోకి ప్రత్యేక అతిథిగా హాజరైన పవన్‌కల్యాణ్ స్పీచ్ ‘సిగ్గు’ అనే పదం చుట్టూ తిరిగాయి. “పదేళ్ల క్రితం ‘మీరంత సిగ్గు లేకుండా ఎలా నటిస్తారండీ’ అని పవన్ నన్ను అడిగారు” అని రవితేజలాంటి స్టార్ హీరో పబ్లిగ్గా చెప్పడం ఆశ్చర్యం అయితే.. అందుకు బదులుగా పవన్ ఇచ్చిన వివరణ.. ఈ ఇద్దరు హీరోల మధ్య సఖ్యత, సరదా నవ్వులు ప్రేక్షకుల్ని ఆశ్యర్యపరిచాయి. సాధారణంగా రవితేజను హుషారుకి మారుపేరుగా అందరూ చెబుతుంటారు. కానీ, పవన్ ఆ హుషారు వెనుక ఆవేదన గురించి మాట్లాడారు. “రవితేజ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నవ్వులు, నటన వెనుక చాలా తపన, కష్టం, కృషి, ఇంకా మాటల్లో చెప్పలేని కష్టాలతో కూడిన బాధలు వున్నాయి. ఓ వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడంటే…. గుండెల్లో ఎంతోకొంత ఆవేదన వుంటుంది. ఆవేదన, బాధ లేకపోతే హాస్యం అనేది రాదు. అందుకని రవితేజ గారంటే నాకిఇష్టం, గౌరవం. ఆయన నటుడిగా ఎదుగుతున్న స్థాయి నుంచి దగ్గరగా చూశా. ఎక్కడా ఆత్మ స్థైర్యం, ఆత్మ విశ్వాసం సన్నగిల్లకుండా తట్టుకుని నిలబడి అనేక ఒడిడుకులు ఎదుర్కొని ఈ స్థాయిలో వుండటం నాకు నిజంగా ఆనందంగా వుంది” అని పవన్ అన్నారు.
అక్కణ్ణుంచి పవన్ మాటల్లో సరదా మొదలైంది. “ఈయన (అంటే రవితేజ) అంత సిగ్గు లేకుండా ఎలా యాక్ట్ చేస్తాడని అనుకుంటుంటా. నేను చాలా ఇష్టంతో చెప్పిన మాట అది. సిగ్గు వదిలేసి యాక్ట్ చేయాలంటే నాకు ఇబ్బందిగా వుంటుంది. అందుకని పారిపోతుంటా. ఇప్పుడు కూడా పారిపోవాల్సి వచ్చింది. రవితేజగారిని చూస్తే… ఎంతమంది జనం వున్నా, ఎలాంటి పాత్ర చేయాలనుకున్నా సిగ్గు అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి బయటకు వచ్చి బలంగా చేయగల నటుడు. అందుకే ఆయన అంటే నాకు ఒక ఇన్స్పిరేషన్” అని పవన్ చెప్పారు. అప్పుడు పక్కన రవితేజను చూడాలి… ముసిముసి నవ్వులతో భలే సిగ్గు పడ్డారు.