తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన అభ్యర్థుల తరపున ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహించాల్సిన ప్రచార పర్యటనలు రద్దు అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఆయన తెలంగాణలోని కీలక మున్సిపాలిటీల్లో రెండు రోజుల పాటు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. శని, ఆదివారాలను ఇందు కోసం కేటాయించారు. అనివార్య కారణాలతో శుక్రవారం రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు.
పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు చేయడానికి రాజకీయ పరమైన కారణాలే కీలకమని భావిస్తున్నారు. ఆయన పర్యటనపై కాంగ్రెస్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తోంది. లోకల్ ఎన్నికల కోసం ఇతర రాష్ట్రాల నాయకులతో ఎందుకు ప్రచారం చేయించుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని ప్రస్తావించి ..సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.
మరో వైపు జనసేన పార్టీ కూడా ఎన్నికల బరిలో ఉంది. పలు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు తమ అధృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్నేహపూర్వక పోటీ అని చెప్పినప్పటికీ.. పవన్ తన పార్టీ తరపున కాకుండా బీజేపీ కోసం ప్రచారం చేయడం అభ్యర్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అదే సమయంలో మున్సిపల్ ఎన్నికలకూ పవన్ లాంటి వాళ్ల ప్రచారం అవసరమా అన్న ప్రశ్నలు రావడంతో చివరికి .. పవన్ ప్రచారాన్ని బీజేపీ, జనసేన కలిసే రద్దు చేసుకున్నాయని భావిస్తున్నారు.

