జగన్మోహన్ రెడ్డి లిక్కర్, ఇసుక వంటి స్కాములతో వేల కోట్లు వెనకేసుకుంటే ఆయనకు పెద్ద పాలేరుగా ప్రకటించుకున్న పేర్ని నాని లాంటి వాళ్లకు చిల్లర కూడా విదిలించినట్లుగా లేరు. ఆ స్కాముల్లో పాలు పంచుకున్న వాళ్లు కూడా కోట్లు కూడబెట్టారు కానీ పేర్ని మాత్రం చిన్న చిన్న స్కాములు చేసి దొరికిపోతున్నారు. ఆయనపై వస్తున్న ఆరోపణలను చూసి.. ఆయన అనుచరులు కూడా బాధపడాల్సి వస్తోంది. ఇంత చిన్న చిన్న స్కాములు చేసి.. ముందస్తు బెయిల్ వచ్చే వరకూ పరారీ కావడం ఏమిటన్న అని మథనపడుతున్నారు.
తాజాగా పేర్ని నాని చేసిన ఓ స్కామ్ బయటకు వచ్చింది. మచిలీపట్నంలోని రంగనాయక స్వామి ఆలయానికి చెందిన భూములను ఆయన అణాకాణికే కొట్టేశారని తాజా ఆరోపణలు వచ్చాయి. అయితే అది ఇప్పుడు జరిగినా దానికి మాత్రం వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగింది. రంగనాయక ఆలయానికి చెందిన భూముల్ని అప్పనంగా వేలం వేయించారు. తక్కువ ధరకు బినామీలతో కొనుగోలు చేయించారు. మొత్తం ఐదున్నర ఎకరాల వరకూ ఇలా కొనుగోలు చేశారు. అయితే అప్పట్లో మొత్తం డబ్బులు చెల్లించలేదు. మళ్లీ 2011లోనే మిగిలిన డబ్బులు చెల్లించారు. మామూలుగా అయితే డబ్బులు కొద్ది నెలల పాటు చెల్లించకపోతేనే ఒప్పందం కాలపరిమితి తీరిపోతుంది.
బినామీల పేర్ల మీద ఉన్న స్థలాలను జగన్ సీఎం అయ్యాక తన కుటుంబ సభ్యుల పేర్ల మీదకు మార్చుకున్నారు. భార్య పేరు మీద.. మామ పేరు మీద ఆస్తులు రాయించుకున్నారు. మొత్తంగా పదిహేను వదల గజాల ఆలయ భూముల స్థలం వీరి పేర్ల మీద రిజిస్టర్ అయింది. మిగతా భూమిని కూడా తమ పేరు మీద మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారిలో కొంత మంది ఇవ్వడం ఇష్టం లేక.. ఈ స్కామ్ ను బయటపడేలా మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం వెలుగు చూసింది.
పేర్ని గతంలో గోడౌన్లు కట్టించి..బియ్యం నిల్వ చేసి ఆ బియ్యం అమ్ముకున్నారు. దొరికిపోయి.. దాదాపు మూడు కోట్లు వరకూ వెనక్కి కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ స్థలాల విషయంలో ఆయన దొరికిపోయారు. పేర్ని ఒక్క సారే వందల కోట్లు సంపాదించి ఉంటారని ఆయన అనుచరులు అనుకుంటున్నారు కానీ మరీ ఇంత చిన్న చిన్న స్కాముల్లో దొరికిపోవడం వారికి కూడా నామోషీగానే ఉంది.