తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. బీఆర్ఎస్ పెద్దల వద్ద ఇప్పటికీ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయని, తన కాన్ఫరెన్స్ కాల్స్‌ను కూడా వింటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, అధికారంలో ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వద్ద నిఘా వర్గాలు, పోలీస్ యంత్రాంగం ఉన్నప్పుడు, నిజంగానే ట్యాపింగ్ జరుగుతుంటే రహస్య ఆపరేషన్ ద్వారా ఆ పరికరాలను స్వాధీనం చేసుకోవాలి కానీ, ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మంత్రి పొంగులేటి తన కాన్ఫరెన్స్ కాల్‌ను ట్యాపింగ్ చేశారని చేసిన ఆరోపణల్లో సాంకేతికపరమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కాన్ఫరెన్స్ కాల్ అంటే ఒకరి కంటే ఎక్కువ మంది పాల్గొనే సంభాషణ. అందులో ఉన్న వ్యక్తుల్లో ఎవరైనా ఆ కాల్‌ను సులభంగా రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తితో వ్యక్తిగతంగా మాట్లాడే వన్ టు వన్ కాల్ రికార్డింగ్ బయటకు వస్తే దాన్ని ట్యాపింగ్‌గా అనుమానించవచ్చు కానీ, కాన్ఫరెన్స్ కాల్ రికార్డింగ్‌ను ట్యాపింగ్‌గా పేర్కొనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం చేతిలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని, ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి పొలిటికల్ స్టంట్స్ చేయడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు పాత కేసులో విచారణలు జరుగుతుండగానే, కొత్తగా మళ్ళీ ట్యాపింగ్ జరుగుతోందని మంత్రి అనడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా అన్న కోణంలోనూ చర్చ సాగుతోంది.