తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాల సవాళ్లు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ యాత్రను సమర్థించుకోవడానికి తెలంగాణలోనూ ఓట్ చోరీ జరిగిందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఓట్ చోరీ చేయకపోతే బండి సంజయ్ కు అంత మెజార్టీ ఎలా వస్తుందని వాదించారు. తెలంగాణలో బీజేపీ తరపున గెలిచిన వాళ్లంతా ఓటు చోరీ ద్వారానే గెలిచారని ఆరోపించారు.
మహేష్ గౌడ్ ఆరోపణలకు.. బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అలా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వచ్చిందని..తామే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కదా అని ప్రశ్నించారు. ఇప్పుడయినా మించిపోయింది లేదు.. దొంగ ఓట్లు అన్నీ తీసేసి.. మళ్లీ ఎన్నికలకు వెళదాం.. రాజీనామాలు చేయాలని సవాల్ చేశారు.మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా అదే డిమాండ్ చేశారు. తాము ఓడిపోయిన చోట్ల ఓట్ చోరీ ఆరోపణలు చేస్తే ఓ రకంగా కన్విన్సింగ్ గా ఉండేదేమో కానీ గెలిచిన చోట.. ప్రభుత్వం ఉన్న చోట.. సగం పార్లమెంట్ సీట్లలో గెలిచిన చోట కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేయడం ఎబ్బెట్టుగా మారింది.
అసలు ఓటు చోరీ డౌట్ ఉండాల్సింది బీఆర్ఎస్ పార్టీకి. ఆ పార్టీ సగం సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఇంత ఘోరంగా ఓడిపోతామని అనుకోలేదు. కానీ ఆ పార్టీ ఈ అంశంపై ఒక్క మాట మాట్లాడలేకపోతోంది. వైపీపీకి, బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటే సమస్య. అందుకే తెలంగాణలో రాజకీయాలు..కాంగ్రెస్ , బీజేపీ అన్నట్లుగా మారిపోతున్నాయి. ఓటు చోరీ రాజకీయంతో వారు గ్రౌండ్ లో తామిద్దరమే ఉండేలా చూసుకుంటున్నారు.